250 ఏళ్ల అద్భుతం – సెప్టెంబర్ 13వ తేదీ.. ఆదివారం.. ఆరు గ్రహాలు ఏం చేయబోతున్నాయి?

నిజమో కాదో ఏమో కానీ.. పండితులు అయితే గట్టిగా చెబుతున్నారు. జ్యోతిష్యం నమ్మేవారు.. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం ఓ గంట పూజ చేస్తే పోయేదీ ఏమీ లేదు కదా

2020.. కరోనా సంవత్సరంగా ఇప్పటి వరకు అనుకుంటున్నాం.. ఇప్పుడు మరో విశేషం వచ్చింది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 10 గంటల 45 నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు.. గంటపాటు అంతరిక్షంలో అద్భుతం జరగబోతున్నది. గతంలో ఎప్పుడూ జరగనిది.. ఇప్పుడు జరుగుతుంది. దీని వల్ల ఏం అవుతుంది.. మనిషిపై ఈ గ్రహాలు ఎలా పని చేయబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. జ్యోతిష్య శాస్త్రాన్ని విశేషంగా విశ్వసించే భారతీయులు.. ఈ అద్భుత గడియాలు జీవితాలను మార్చేస్తాయని నమ్ముతున్నారు.

ఏయే గ్రహాలు ఎక్కడ :

2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో ఉంటారు. బుధుడు కన్యా రాశిలో ఉంటాడు.. బుధుడికి అది స్వక్షేత్రం మూల త్రికోణ రాశి కూడా. కుజుడు మేషంలోనూ, గురుడు ధనస్సు రాశిలో, శని మకర రాశిలో ఉంటాడు. ఇది చాలా అరుదైన కాంబినేషన్. తర్వాత 250 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతమైన గడియలు రావని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రాశి చక్రంలో ఉండే 9 గ్రహాల్లో శుక్రుడు మినహాయించి మిగిలిన ఆరు గ్రహాలు వాటి వాటి సొంత ఇళ్లల్లో ఉంటున్నాయి. ఇది చాలా అరుదైన ఘటన అంటున్నారు పండితులు.

అందరికీ లాభం :

ఈ సమయంలో నిష్ఠగా పూజ చేస్తే అనుకున్నది సిద్ధిస్తుందని చెబుతున్నారు పండితులు. కోరిన కోర్కెలు తీరతాయని చెబుతున్నారు. దేవుడిపై భారం వేసి.. పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది అంటున్నారు. ఇలాంటి అద్భుతమైన ముహూర్తంలోనే శ్రీరామ చంద్రుడు జన్మించాడని.. ఆ తర్వాత రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్తు పుట్టినప్పుడు కూడా ఇలాంటి గ్రహస్థితులే ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ఉద్యోగం, వ్యాపారం, జీవితంలోని సమస్యలు, విద్య, ఉన్నత స్థితి.. ఎలాంటి సమస్య అయినా తీరటానికి ఈ గ్రహాలు అనుకూలిస్తాయని చెబుతున్నారు.

నిజమో కాదో ఏమో కానీ.. పండితులు అయితే గట్టిగా చెబుతున్నారు. జ్యోతిష్యం నమ్మేవారు.. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం ఓ గంట పూజ చేస్తే పోయేదీ ఏమీ లేదు కదా.. కనీసం మనశ్సాంతి అయినా దొరుకుతుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి