తెలంగాణ పోలీసుల అద్భుతం – ఫేస్ ఫేస్ రికగ్నిషన్ యాప్ యూపీలో తప్పిపోయిన బాలుడిని అసోంలో పట్టుకున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందిన దర్పన్ యాప్ ఆ కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రుల ఐదేళ్ల కన్నీటిని.. ఆనంద భాష్పాలుగా మార్చింది. తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారానే సాధ్యం అయ్యింది ఇది.
అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం అడిషినల్ డీజీపీ స్వాతి లక్రా చేసిన ట్విట్ ను అభినందిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి రీట్విట్ చేయటంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ నివాసి ఘన్శ్యామ్ సోని.
వీరి కుమారుడు సోమ్ సోని. 13 ఏళ్ల చిన్నారి ఆటిజంతో బాధపడుతున్నాడు. 2015, జూలైలో ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. అలహాబాద్ లో తప్పిపోయిన బాలుడు అసోం వెళ్లాడు. వీధుల్లో తిరుగుతున్న గోలపారా పోలీసులు శిశు సంక్షేమ కేంద్రంలో చేర్పించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ డెవలప్ చేసింది.
దేశంలోని వివిధ శిశు సంక్షేమ కేంద్రాల్లోని పిల్లలను దర్పన్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తిస్తున్నారు. ఇలా చేస్తున్న సమయంలోనే.. తప్పిపోయిన పిల్లల ఫోటోలతో సరిపోల్చగా ఈ బాలుడి ఆచూకీని గుర్తించారు తెలంగాణ పోలీసులు. వెంటనే అలహాబాద్ లోని హండియా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వారు తల్లిదండ్రులను తీసుకుని..
అసోంలోని గోలపారా శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. ఆ బాబు మా బాబు అని ఆ తల్లిదండ్రులు చెప్పటం జరిగింది. ఐదేళ్ల తర్వాత తప్పిపోయిన బాలుడి దొరకటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవదుల్లేవు. కొడుకును హత్తుకుని ఆనందంతో ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల వీడియోను పోస్ట్ చేశారు స్వాతిలక్రా.. దీన్ని రీట్విట్ చేశారు డీజీపీ.
తప్పిపోయిన బాలుడిని గుర్తించడంలో తెలంగాణ పోలీసులు పోషించిన పాత్రను కొనియాడారు యూపీ, అసోం పోలీసులు. ఫేస్ రికగ్నిషన్ టూల్, దర్పన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నట్లు తెలిపారు స్వాతి లక్రా.