ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు రావటం సంచలనంగా మారింది. టీవీ రేటింగ్స్ ఇచ్చే బార్క్ సంస్థ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాతో.. 2019 సంవత్సరంలో చాటింగ్ చేసిన విషయాలను.. తేదీలతో సహా.. 500 పేజీల వాట్సాప్ చాటింగ్ ను ముంబై పోలీసులు బయటపెట్టటం కలకలం రేపుతోంది. బార్క్ లో తనకు పదవి కావాలని.. రేటింగ్ విషయంలో సాయం చేయాలని కోరుతూనే.. మిగతా మీడియా ఛానల్స్ పై చులకనగా మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు అందరూ తనతో టచ్ లో ఉన్నారని.. బీజేపీ కోసం ఈ ఛానల్ పెట్టామని ఆర్నాబ్ చాట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.
నిన్ననే అమిత్ షాతో ఇంటర్వ్యూ చేశాను చూశారా అని చాట్ చేసిన ఆర్నాబ్.. బ్రాడ్ కాస్ట్ మినిస్టర్ ప్రకాష్ జవదేర్ యూజ్ లెస్ ఫెలో అని సంబోధించారు. ఇండియా టీవీ ఎడిటర్ రజత్ ను ఫూల్ పర్సన్ అని.. టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కచరా అంటూ చులకన చేసి మాట్లాడాడు ఆర్నాబ్ గోస్వామి. కేంద్ర మంత్రులను సైతం తక్కువ చేసి మాట్లాడటంతోపాటు.. మిగతా మీడియా వాళ్లు అందరూ దద్దమ్ములు అన్నట్లు చాటింగ్ లో కామెంట్ చేస్తారు ఆర్నాబ్.
టీవీ రేటింగ్ ట్యాంపరింగ్ విషయంలో బార్క్ – రిపబ్లిక్ టీవీ మధ్య గొడవలు కేసు నడుస్తున్న సమయంలోనే.. ఓ ఆత్మహత్య కేసులో ఆర్నాబ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విషయంలో ముంబై పోలీసులను టార్గెట్ చేసిన ఆర్నాబ్.. చాలా సార్లు ముంబై కమిషనర్ పై డిస్కషన్స్ పెట్టాడు. మహారాష్ట్రలో శివసేన – బీజేపీ పార్టీలు కటీఫ్ అయినప్పటి నుంచి శివసేన సోనియాసేన అంటూ దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్న శివసేన పార్టీ, ముంబై పోలీసులు.. అదును చూసి దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది.
2019లో బార్క్ మాజీ సీఈవో గుప్తాతో.. ఆర్నాబ్ చేసిన 500 పేజీల వాట్సాప్ చాటింగ్ బయటకు రావటంలో సంలచనంగా మారింది. మీడియా – పొలిటికల్ పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయం చెప్పటం కొత్త కాకపోయినా..
వాట్సాప్ చాటింగ్ కూడా సేఫ్ కాదు అని ఈ ఘటనతో స్పష్టం అయ్యింది. ఎవరి వాట్సాప్ చాటింగ్ డేటా అయినా.. ఎన్ని సంవత్సరాలది అయినా పోలీసులు బయటపెడతారనే విషయం తేలిపోయింది.. మన డేటాకు భద్రత ఇంకెక్కడ ఉంది.. వ్యక్తిగత భద్రతకు వాట్సాప్ సేఫ్ కాదని స్పష్టం అయ్యింది ఈ ఘటనతో..