గ్రేటర్ ప్రచారం స్పీడందుకుంది. బడా లీడర్లంతా రోడ్డెక్కుతున్నారు. మైకులు ఊదరగొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.. వ్యూహాలు అమలు చేస్తున్నారు. దుబ్బాక విజయంతో గ్రేటర్ పీఠంపై కన్నేసిన బీజేపీ.. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. అయితే అదంతా ఈజీనా..? కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తుందా..? అయితే ఏదైనా ఓ రాజకీయ పార్టీ ప్రజల ఓట్లను సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా.. బల్దియా పోరులో బీజేపీ అనుసరిస్తున్న ఓ వ్యూహం.. ఇతర పార్టీలకు చెందిన సీనియర్లకు కాషాయ తీర్థం ఇవ్వడం.
ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన అసంతృప్త కార్పొరేటర్లకు కాషాయ కండువాను మార్చిన బీజేపీ లీడర్లు.. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెందిన పలువురు సీనియర్లను కమలం గూటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణను కలిసిన బీజేపీ పెద్దలు.. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అలాగే ఒకప్పుడు టీఆర్ఎస్ లీడర్.. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కూడా గాలం వేశారు. బీజేపీలోకి రావాలంటూ సాదరంగా ఆహ్వానించారు.
కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మరో సీనియర్ లీడర్ లక్ష్మణ్ కలిశారు. బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. అయితే ఈ సీనియర్లను ఆయా పార్టీలేవీ పట్టించుకోవడం లేదు. చాలాకాలంగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. మరి వీరికి కాషాయ తీర్థం ఇస్తే ఎంతమేరకు ఉపయోగపడుతుంది..? గ్రేటర్ ఎన్నికల్లో వీరి ప్రభావమెంత..? సరే.. ఈ ఒక్క ఎన్నికలకు మాత్రమే కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలా ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రోత్సహిస్తున్నామని చెబుతారా..? ఏదేమైనా.. ప్రజల్లో పెద్దగా ప్రభావం లేని లీడర్లను పార్టీలోకి ఆహ్వానిస్తే.. ఎంతమేర ఫలితం వస్తుందో కమలం నాయకులకే తెలియాలి.