విగ్రహాలు ధ్వంసం చేయటం.. దాన్ని రాజకీయం చేయటం చూస్తుంటే కలియుగం క్లయిమాక్స్ కు వచ్చినట్లు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రోజునే.. విగ్రహాలు ధ్వంసం చేసి.. వాటిని ఎల్లో మీడియాలో హైలెట్ చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరిని టార్గెట్ చేసి ఇంతటి దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని.. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని.. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే దేవుడు కూడా చూస్తూ ఊరుకోడని.. దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 200 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని.. వారిపై విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భయం, భక్తి ఉన్నోళ్లు ఎవరూ దేవుడి విగ్రహాల జోలికి వెళ్లరని.. నీచ రాజకీయాలు చేసే వాళ్లే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతారన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి.. ఆ తర్వాత వాళ్లే రచ్చ చేస్తున్నారని.. ఎవరికి లాభమో ప్రజలు గమనించాలన్నారు. కలియుగం క్లయిమాక్స్ అంటే ఇదేనేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.