న్యూజీల్యాండ్, పాకిస్తాన్ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కివీస్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు సభ్యులకు కరోనా సోకడంతో.. అసలు సిరీస్ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్‌లో ఉన్న పాకిస్తాన్ ఆటగాళ్లకు కరోనా టెస్ట్ చేయడంతో.. ఫలితాల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు.. న్యూజీల్యాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. దీంతో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వారిని ఐసోలేషన్‌కు తరలించింది.
ఆటగాళ్లు, స్టాఫ్‌తో కలిపి మొత్తం 53 మంది వచ్చారని.. రెండు రోజుల క్రితం జరిగిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశ వైద్య శాఖ వెల్లడించింది. ఆరుగురిలో ఇద్దరికి గతంలోనే కరోనా సోకిందని.. నలుగురికి కొత్తగా వచ్చినట్లు వివరించింది.
లాహోర్ నుంచి బయల్దేరే ముందే క్రికెటర్లకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారని.. అక్కడ అందరికీ నెగటీవ్ వచ్చినట్లు వివరించింది. టీమ్ మెంబర్స్ అందరినీ నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశించినట్లు స్పష్టం చేసింది.
కివీస్ టూర్లో ఉన్న పాకిస్తాన్ జట్టు.. మూడు టీ 20, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆటగాళ్లకు కరోనా సోకడంతో సిరీస్ జరుగుతుందా..? లేదా..? అన్నది సందిగ్ధంలో పడింది.