నిమ్మగడ్డ ఆస్తులపై ఈడీ దాడులు – ఆస్తులు జప్తు – బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టి సినిమాల్లో పెట్టుబడి
వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు అయిన నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎస్‌కే విశ్వనాథ్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఆస్తులు జప్తు చేసింది. చేపల చెరువుల వ్యాపారం కోసం గుడివాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 19 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టింది నిమ్మగడ్డ రామకృష్ణ కు చెందిన వీనస్ ఆక్వా ఫుడ్స్ కంపెనీలు. ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ.. అక్టోబర్ 21వ తేదీ ఆస్తులను సీజ్ చేసింది.
చేపల చెరువుల కోసం అప్పు తీసుకుని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు నిర్థారించారు. హైదరాబాద్, విజయవాడలో 33 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న ఆస్తులకు సీజ్ వేసింది ఈడీ. లావాదేవీలను నిలిపివేసింది. నిందితులు బ్యాంకు అప్పుతోపాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి చేపల చెరువు పేరుతో 22 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని విచారణలో తేలింది.
బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులను నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్‌లు తమ పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ డబ్బుతో ఆకాశమే హద్దు అనే సినిమాలో పెట్టుబడి పెట్టారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ నిబంధనల కింద ఈడీ వీనస్ ఆక్వా ఫుడ్స్ అక్రమాలపై దర్యాప్తు జరుగతుంది.