పేకాట డెన్స్ పై ఇంటెలిజెన్స్ నిఘా.. పెద్ద బాస్ క్లాస్ పీకటంతో అలర్ట్ అయిన మిగతా వాళ్లు

ban of poker in andhrapradesh

ఏపీలో పేకాటపై నిషేధం ఉంది. దీన్ని గట్టిగా అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు చూసీచూడనట్లు వ్యవహరించిన పెద్దలు.. ఇక నుంచి ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఆరు నెలల క్రితం ఓ మంత్రి ఇలాకాలోని పేకాట క్లబ్ పై అర్థరాత్రి దాడి జరిగితే.. 70 మంది పట్టుబడ్డారు. లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు. ఆ మంత్రికి తెలియకుండానే.. తన నియోజకవర్గం పరిధిలో పోలీసులు దాడి చేయటం అప్పట్లో సంచలనంగా మారింది.

సీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి బంధువుల ఆధ్వర్యంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని.. రోజూ కోట్ల రూపాయల్లో చేతులు మారుతున్నాయని ఇంటెలిజెన్స్ నిఘా పసిగట్టి పెద్దలకు సమాచారం ఇచ్చారంట. ఆ మంత్రిని పిలిచి క్లాస్ పీకి పించారనే వార్త అధికార పార్టీలో కలకలం రేపుతోంది.

బెజవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ.. ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే అండదండలతో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని.. వాళ్లకు పోలీసుల సపోర్ట్ ఉందనే వార్తలు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే కొందరిని బదిలీ చేశారని గుసగుసలాడుకుంటున్నారు నేతలు.

కొన్ని నెలలుగా పేకాట డెన్స్ భారీగా పెరిగాయన్న వార్తలతో ప్రభుత్వంలోని పెద్దలు.. ఇంటెలిజెన్స్ నిఘాను పెంచారని.. ఈ సందర్భంలోనే అధికార పార్టీకి చెందిన చాలా మంది ఈ పేకాట డెన్స్ కు అండదండలు అందిస్తున్నారనే సమాచారం ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది.

ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన ప్రభుత్వం.. పేకాట శిబిరాలపై దాడులు ముమ్మరం చేయాలని.. ఎవర్నీ ఉపేక్షించొద్దని పోలీస్ శాఖను ఆదేశించిందంట. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరికీ తెలియకుండా మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు గుసగుసలాడుకుంటున్నారు నేతలు.

ప్రభుత్వ పెద్దల వైఖరిని పసిగట్టిన పేకాట క్లబ్బుల నిర్వహకులు.. ఉన్నఫళంగా ఎక్కడికక్కడ సర్దుకున్నారంట. హీట్ తగ్గేవరకు కూల్ గా ఉందామని డిసైడ్ అయ్యారంట. ఈ క్రమంలోనే గత 15 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా పేకాట డెన్స్ 60 శాతం మూతపడ్డాయని సమాచారం.

ఇంటెలిజెన్స్ నిఘాను పెంచటం, పేకాట శిబిరాలపై దాడులు క్రమంగా జరగాలనే ప్రభుత్వ పెద్దల నిర్ణయంతో.. ఎవరికి వాళ్లు ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారంట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు