తిరుపతి ఉప ఎన్నికలో జోరుగా రెండు రకాల బెట్టింగ్స్

తిరుపతి ఉప ఎన్నికలో జోరుగా రెండు రకాల బెట్టింగ్స్

తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి కారణంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జెడ్పీ ఎన్నికలను బహిష్కరించి సెల్ఫ్ గోల్ వేసుకోవటం ఒకటి అయితే.. బీజేపీ – జనసేన పొత్తుతో ఓట్లు ఎన్ని వస్తాయి అని. అధికార పార్టీ అధినేత సీఎం జగన్ ప్రచారం చేయకుండానే గెలిపిస్తాడు అని టాక్ ఉంది. ఇవన్నీ రొటీన్ విషయాలే అయినా.. ప్రధానంగా రెండు రకాల బెట్టింగ్స్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.

తిరుపతి ఉప ఎన్నికలో జోరుగా రెండు రకాల బెట్టింగ్స్ – బెట్టింగ్ నెంబర్ వన్ :

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది. గెలుపు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. మరి మెజార్టీపైనే బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో 55.03 ఓట్ల శాతంతో.. 7 లక్షల 22 వేల 877 ఓట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు.. 2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజార్టీ ఘన విజయం సాధించారు. ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని.. కనీసం 4 లక్షల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధిస్తున్నాడని పందెం కాస్తున్నారు అధికార పార్టీ అభ్యర్థులు. ఎంతకైనా సరే.. ఎంతైనా సై అంటున్నారు. నాలుగు లక్షల మెజార్టీ తగ్గదని వైసీపీ బెట్టింగ్ రాయుళ్లు సవాళ్లు విసురుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో జోరుగా రెండు రకాల బెట్టింగ్స్ – బెట్టింగ్ నెంబర్ టూ :

రెండో స్థానం ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు మరో ఆసక్తికరమైన బెట్టింగ్. టీడీపీ నిలుస్తుందా.. బీజేపీ – జనసేన అభ్యర్థి రత్నప్రభ రెండో స్థానంలో నిలుస్తుందా అనే అంశంపై బెట్టింగ్ సాగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన.. ప్రస్తుత పోటీ అభ్యర్థి పనబాక లక్ష్మి 4 లక్షల 94 వేల 501 ఓట్లు సాధించింది. ఇది సామాన్యమైన ఓట్లు కాదు. దాదాపు ఐదు లక్షల ఓట్లు సాధించిన టీడీపీ.. రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికలో ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకుంటుందా లేదా అనేది ప్రధాన పాయింట్ అయ్యింది. బీజేపీ – జనసేన కూటమి సైతం గట్టిగా పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే రెండో స్థానం ఎవరికి దక్కుతుంది అనేది బెట్టింగ్ రాయుళ్ల పందాలు.

2019 ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈసారి సైతం ఇంచుమించు అదే స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు