మంత్రులు ఈటెల, మల్లారెడ్డిని టార్గెట్ చేస్తున్న కొత్త రాజగురువు?

మంత్రులు ఈటెల, మల్లారెడ్డిని టార్గెట్ చేస్తున్న కొత్త రాజగురువు?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సమాంతరంగా కొత్త వ్యవస్థ తయారైందా.. ప్రభుత్వ వ్యవస్థలో పని చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేస్తూ.. ఆ వ్యవస్థ కొత్త రూపం సంతరించుకుందా.. ప్రభుత్వంపైనే నిఘా పెట్టేంత స్థాయిలో ఆ ప్రైవేట్ వ్యవస్థ పెత్తనం చెలాయిస్తుందా.. ప్రస్తుత పరిణామాలను ఇదే విధంగా విశ్లేషిస్తున్నారు.. అంచనా వేస్తున్నారు.

మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, మల్లారెడ్డిలను ఇటీవల కాలంలో మీడియా పరంగా టార్గెట్ కావటం సంచలనంగా మారింది. బయట నుంచి చూసే వారికి రొటీన్ గా ఉన్నా.. రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారికి మాత్రం ఇది కుట్రగా అనిపిస్తుంటే.. మరింత లోతుగా ఆలోచిస్తే మాత్రం తెలంగాణలో కొత్త రాజగురువు తయారయ్యాడు అంటున్నారు.

ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులతోపాటు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ వైద్యంపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ వైద్యం సామాన్యులకు సరిగా అందటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ అటుంచితే.. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు.. కులం, డబ్బు, పార్టీ జెండా కాదు అంటూ సామాన్యులు ఊహించని కామెంట్స్ చేశారు. మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే.. తన వెనక.. తాను నిర్వహిస్తున్న వైద్య శాఖ పరిధిలో మరొకరి జోక్యం ప్రభలంగా ఉందని భావిస్తున్నారు అందరూ.

అధికార పార్టీ సైతం దూరంగా పెడుతుందనే విషయం మంత్రి ఈటెల వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం అవుతున్నా.. ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ తోపాటు ఇతర నేతలు పిలిచి మాట్లాడిన దాఖలు లేవు. ఈటెల ఈ వ్యాఖ్యల వెనక.. ప్రభుత్వ వైద్య రంగాన్ని బాగుచేద్దామనే తన ఉద్దేశాన్ని.. కొన్ని కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయనే భావన నిశితంగా పరిశీలిస్తే అందరికీ అర్థం అవుతుంది.

ఇక మంత్రి మల్లారెడ్డి. వందల ఎకరాలు భూములు, కార్పొరేట్ కాలేజీలు ఉన్న అత్యంత ధనవంతుడు. ఇటీవల రియల్ ఎస్టేట్ దందా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆడియో లీక్ కూడా అధికార పార్టీకి కంచుకోటగా ఉండే ఛానల్ నుంచే లీక్ కావటం వెనక.. ప్రభుత్వ కుట్ర ఉందా అనే అనుమానాలు అతి సామాన్యుల బుర్రలను తొలుస్తున్నాయి. మల్లారెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టటంతోపాటు.. హైదరాబాద్ చుట్టుపక్కల బలమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న.. నిర్వహించే వారికి కొమ్ముకాస్తున్నారు మంత్రి మల్లారెడ్డి అనే వాదన ఉంది. రియల్ వ్యాపారాల నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే.. మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఇద్దరు మంత్రులే కాదు.. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధనవంతులపై రాజగురువు కన్నేశారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంతకీ ఆ రాజగురువు మనకు కనిపించే అతీత శక్తే అయినా.. గుర్తు పట్టటం.. గుర్తు పట్టినా.. అవునా అని ఆశ్చర్యపోవటం కామన్ గా జరిగేది..

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో రాజగురువు అంటే ఈనాడు రామోజీరావు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే విమర్శించేది.. మరి ఈ తెలంగాణ రాజగురువుపై బహిరంగ తిరుగుబాటు వచ్చే వరకు అతను ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఆ సమయం వచ్చే వరకు వెయిట్ అండ్ సీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు