22 కిలోమీటర్లు నడిచి స్కూల్ కు వెళతాడు : పదో తరగతిలో 82 శాతం మార్కులు

kid walk 22 km a day to go school

దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. ఆ మనుషుల్లోనూ రేపటి తరం ఉందన్న సంగతి ఈ పాలకులు గుర్తించాల్సిందే.. గుర్తించనప్పుడు.. ఇలాంటి పిల్లలు గుర్తు చేస్తూ ఉంటారు. కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే ఈ కథనం.. ప్రతి తల్లిని.. తండ్రిని ఆలోచింపజేస్తోంది.

మహారాష్ట్రం రాష్ట్రం.. పూణె జిల్లాలోని ఓ మారుమూల గ్రామాల్లోని దుస్థితి ఇది. వెల్తా అనే గ్రామంలో అనంత అనే 16 ఏళ్ల పిల్లోడు.. ప్రతి రోజూ 11 కిలోమీటర్ల దూరంలోని పనైట్ అనే గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ కు వెళ్లి వస్తూ చదువుకుంటున్నాడు. పోను 11 కిలోమీటర్లు.. రాను 11 కిలోమీటర్లు.. ఇలా రోజూ 22 కిలోమీటర్లు నడుస్తూ.. పదో తరగతి పరీక్షల్లో 82 శాతం మార్కులు సాధించి.. స్కూల్ టాపర్ గా నిలిచాడు.

అనంత్ తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి ఓ క్యాంటిన్ లో సప్లయిర్ గా పని చేస్తుంటాడు.. తల్లి కూలిపనులు చేస్తూ ఉంటుంది. మట్టి ఇల్లు ఉంది. మొత్తం ముగ్గురు పిల్లల్లో అనంత్ ఒకడు. చదువుపై ఉండే శ్రద్ధతో కష్టమైనా.. ఇష్టంగా నడిచివెళ్లి చదువుకుంటున్నారు.

ఆ ఊరికి బస్సు లేదా అంటే.. ఆర్టీసీ బస్సు వస్తుంది. కాకపోతే తెల్లవారుజామునే వచ్చిపోతుంది. సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య మళ్లీ వస్తుంది.. వారం నాలుగు రోజులు సాయంత్రం పూట వస్తుందో రాదో కూడా తెలియదు. మరి ఆ బస్సులోనే పోవచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. స్టూడెంట్ బస్సు పాస్ కింద ప్రతినెలా 660 రూపాయలు చెల్లించాలంటే. అంత డబ్బు లేదు.. రోజువారీ టికెట్ కొనుగోలు చేయాలన్నా.. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి రావాలంటే 15 వందల రూపాయలు ఖర్చు అవుతుందంట. పిల్లోడి చదువు కోసం 660 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితితో ఓ కుటుంబం లేదు. ఎందుకంటే ఆ తండ్రి రోజువారీ సంపాదన 150 రూపాయలు మాత్రమే. ఇందులో ఐదుగురు బతకాలి కదా..

ఇదే విషయాన్ని మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అధికారులను ప్రశ్నిస్తే.. రోజూ ఆ గ్రామానికి బస్సు తిరగకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయని.. తక్కువ సంఖ్యలో గ్రామాలకు బస్సులు తిప్పటం సాధ్యం కావటం లేదని చెబుతున్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న అనంత్.. కాలి నడకనే 22 కిలోమీటర్లు వెళ్లి వస్తూ పదో తరగతి 82 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్ కోసం పూణె వెళ్లాలి.. తన గ్రామం నుంచి 60 కిలోమీటర్లు.. నడిచి వెళ్లటం సాధ్యం కాదు కాబట్టి.. దానికో మార్గం చూపించాలని స్కూల్ టీచర్లను కోరుతున్నాడు.

పదో తరగతి కోసం అనంత్ 22 కిలోమీటర్లు నడవటం ఇది కొత్త కాదని.. ఆరో తరగతి వరకు నాలుగు కిలోమీటర్లు నడిచేవాడని.. అనంత్ కు చదువుపై ఉన్న శ్రద్ధతో మంచిగా ప్రోత్సహించామని చెబుతున్నారు టీచర్లు.

నేటి తరం పిల్లలకు ఇది ఓ స్ఫూర్తి దాయకం.. చదువుపై శ్రద్ధ ఉండాలి కానీ.. ఏసీ గదుల్లో ఉన్నామా.. నారాయణలో చదివామా.. చైతన్యలో చదివామా అన్నది కాదు కదా ముఖ్యం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు