నందిగ్రామ్ లో మమత ఓడిపోయే అవకాశం.. మరోస్థానం నుంచి పోటీ

పశ్చిమ బెంగాల్ లో రెండవ దశ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మొదటి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండవ దశలో 30 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. రెండవ దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేసిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ పూర్తైంది. ఈ స్థానంలో ఆమెకు పోటీగా బీజేపీ నేత సువెందు అధికారి నిల్చున్నారు. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగినట్లు తెలుస్తుంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోతారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్ లో మమతా ఓడిపోతుందని తెలిపారు. మమత సొంత పార్టీ నేతలే తనకు ఈ విషయం తెలిపారని జేపీ నడ్డా వివరించారు. ఆమె మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తమకు సమాచారం అందిందని నడ్డా అన్నారు. సొంత పార్టీ నేతల్లో కూడా చర్చ నడుస్తుందని, మమతకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

కాగా సువెందు అధికారి మమతకు మంచి సన్నిహితుడు గతేడాది డిసెంబర్ లో అతడు తృణమూల్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే మమతకు సువెందుకు మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సువెందు మమతా పోటీ చేసే స్థానం నుంచే పోటీ చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అక్కడినుంచే బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే గురువారం జరిగిన రెండవ దశ పోలింగ్ లో నందిగ్రామ్ లో 80 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో 22 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు ఎన్నికల సంఘం అధికారులు. ఒక నియోజకవర్గానికి ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగానే బలగాలను మోహరిస్తారు.. ఎంతభారీగా మోహరించిన 10 , 12 కంపెనీలకంటే ఎక్కువ ఉండదు. కానీ నందిగ్రామ్ లో మాత్రం 22 కంపెనీల బలగాలను మోహరించి ఎన్నికలు జరిపారు. అయినా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.

నందిగ్రామ్ లో మమత ఓడిపోయే అవకాశం.. మరోస్థానం నుంచి పోటీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు