ప్రధాని మోడీ ఆదేశాలతో.. బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రత్నప్రభ

modi behind bjp candidate in tirupathi elections

ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనేది సహజంగానే పార్టీ లోకల్ క్యాడర్ లేదంటే రాష్ట్ర నాయకత్వం నిర్ణయింది. అలాంటిది ఓ ప్రధానమంత్రి.. ఓ లోక్ సభ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తి చూపించారు అంటే వారి విలువ ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇది ఎక్కడో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయంలో జరిగింది. ఎవరూ ఊహించని విధంగా మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పని చేసిన.. ఏపీకి చెందిన రత్నప్రభను బీజేపీ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించటం సంచలనంగా మారింది. ఈ ప్రకటనను ఏకంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ స్వయంగా ఢిల్లీ నుంచి ప్రకటించింది.

అభ్యర్థిగా రత్నప్రభ ఎంపిక విషయంలో ప్రధానమంత్రి మోడీ సైతం ఆసక్తి చూపించారంట. దీనికి కారణం లేకపోలేదు. సరిగ్గా మూడే ళ్ల క్రితం.. ప్రధాని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రత్నప్రభ చేసిన పనిని మెచ్చుకున్నారు. ఆమె ఆఫీసర్ గా ఉన్న సమయంలో గొర్రెలు మేపుతున్న ఒక పిల్లవాడిని పాఠశాలలో చేర్పించింది. 27 సంవత్సరాల తర్వాత ఆ పాఠశాల వైపు వెళ్ళిన ఆమెను చూసి నమస్కరించిన ఒక కానిస్టేబుల్.. ఆరోజు పాఠశాలలో చేర్పించింది నన్నే మేడమ్ అని చెప్పగా.. ఆమె ఎంతో సంతోషించి, ఆ విషయం గురించి ట్వీట్ చేసింది.ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళను రాజకీయాల్లోకి తీసుకురావటం వల్లే మార్పు సాధ్యం అవుతుందని భావించి.. ప్రధాని మోడీ సైతం రత్నప్రభ అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారంట.

విధి నిర్వహణలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి.. ముఖ్యంగా యువత, మహిళా సాధికారతపై మంచి ఆలోచనా విధానం, విజన్ ఉన్నటువంటి రత్నప్రభను తిరుపతి లోక్ సభ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారంట. రాజకీయాల్లో మార్పు రావాలి అంటే గొప్ప గొప్ప వాళ్లు కాదని.. గొప్ప ఆలోచన ఉన్న పేదవారిని సైతం ప్రోత్సహించాలని ప్రధాని మోడీ సూచించారంట. అందులో భాగంగా మొన్నటికి మొన్న పశ్చిమబెంగాల్ లో ఓ పేద మహిళ, ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించే మహిళకు టికెట్ ఇచ్చారు.. ఇప్పుడు రత్నప్రభ.

ప్రధాని మోడీ ఆదేశాలతో బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రత్నప్రభ ఖరారు కావటంతో.. మోడీ సైతం తిరుపతి ప్రచారానికి వస్తారా అనేది చర్చ జరుగుతుంది. ఉప ఎన్నిక కోసం ప్రధాని రారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకా టైం చాలా ఉంది.. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు