రాయలసీమకు అన్యాయం జరగనివ్వం.. తెలంగాణ ప్రాజెక్టులపై కొట్లాట తప్పదు.. సీమ లిఫ్ట్ ఆపేది లేదు

rayalaseema irrigation projects cm kcr and jagan

ఏపీ – తెలంగాణ మధ్య కృష్ణా నీటి వాటాల విషయంపై, ప్రాజెక్టులపై మరోసారి వివాదం తలెత్తింది. నికర జలాల వినియోగం, వరద జలాల వినియోగానికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు.. రాయలసీమలోని నీటి కాల్వల సామర్థ్యాన్ని పెంచటానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతుంది. శ్రీశైలం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కు వెళ్లింది. కేంద్ర జలవనరుల శాఖకు కంప్లయింట్ చేసింది. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆయా శాఖలు ఏపీని ఆదేశించాయి.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పోటీగా తెలంగాణ ప్రభుత్వం.. 100 టీఎంసీల సామర్థ్యంతో కొత్త ఎత్తిపోతల పథకాలను డిజైన్ చేస్తోంది. కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపడుతున్న ఏపీకి పోటీగానే తెలంగాణ ప్రభుత్వం 100 టీఎంసీల సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనగా కొత్త స్కీమ్స్ రెడీ చేస్తోంది. 70 టీఎంసీలతో జోగులాండ్ బ్యారేజీ, సుంకేశుల రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం, బీమా నది నుంచి వరద కాలువ నిర్మాణం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం 20 టీఎంసీలకు పెంపు వంటికి చేపడుతుంది. ఈ పథకాలు పూర్తయితే శ్రీశైలం జలాశయానికి 100 టీఎంసీల నీటి రాక తగ్గిపోతుంది. వరదల సమయంలో పర్వాలేదు కానీ.. నికర జలాల వినియోగంపై ఆధారపడినప్పుడు ఇబ్బందులు తప్పవు.

వర్షాలు లేనప్పుడు, కరువు సమయంలో తెలంగాణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారనుంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అనుసంధానంగా సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సైతం.. 854 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతుంది. అంతకు తగ్గితే నీటిని లిఫ్ట్ చేయటం సాధ్యం కాదు. అలాంటప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులోకి రావాల్సిన 100 టీఎంసీల నీటినే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోసుకోవటం వల్ల.. రాయలసీమకు తీవ్ర నష్టం రానుంది.

ఏపీ ప్రభుత్వం నికర జలాలు, వరద నీటి వినియోగం ఆధారంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా నికర జలాలనే ప్రాజెక్టులోకి రాకుండా ముందుగానే తరలించే కుట్ర చేస్తుందనేది రాయలసీమ రైతుల వాదన.

కొందరు వాదిస్తున్నట్లు డెల్టా ఎడారి అవుతుందనే వాదనను తప్పుబడుతున్నారు రైతులు. పోలవరం ప్రాజెక్టు ద్వారా డెల్టా స్థిరీకరణ అనేది జరిగిపోయింది. ఇప్పుడు కాకపోతే మరో ఏడాదిలో అయినా పూర్తి స్థాయిలో పోలవరం నుంచి గోదావరి నీళ్లను డెల్టాకు అందించే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొంత భాగంతోపాటు రాయలసీమకు పూర్తి అన్యాయం జరగనుంది అనేది రైతుల వాదన.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా డిజైన్ చేస్తున్న ప్రాజెక్టుల వల్ల సీమకు అన్యాయం జరగనివ్వం అని.. తెలంగాణ ప్రాజెక్టులపై కొట్లాట తప్పదంటోంది ఏపీ ప్రభుత్వం. ఇదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగేది లేదని కూడా స్పష్టం చేస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు