కరోనా కోవిడ్ సెంటర్లలో కుర్రోళ్లు.. ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు

young people workign in covid hospitals

కరోనాకు ఏడాది అయ్యింది.. మొదటి లాక్ డౌన్ వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు యువత. సెకండ్ లాక్ డౌన్ వల్ల మరికొన్ని కోట్ల మంది బతుకు దెరువు పోయింది. ముఖ్యంగా యువత ఉద్యోగాలకు ముప్పు వాటిల్లింది. ఈ క్రమంలోనే సరికొత్తగా ఉద్యోగ, ఉపాధి అన్వేషణ చేస్తున్నారు యువత.

ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు మహా నగరాల్లో కరోనా కేసులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం భారీ ఎత్తున కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. ఇదే కొత్త ఉపాధికి బాటలు వేసింది.

కోవిడ్ సెంటర్లలో పని చేయటానికి యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి సాయంగా ఉంటూ ఉపాధి పొందుతున్నారు. పేషెంట్లకు టైం ప్రకారం మందులు ఇవ్వటం, ఫుడ్ సప్లయ్ చేయటం, ఆక్సిమీటర్ చెక్ చేయటం, టెంపరేచర్ నమోదు చేయటం, ఇతర సమస్యలు ఉంటే డాక్టర్లకు చెప్పటం.. వైద్య సిబ్బంది – పేషెంట్ల మధ్య అనుసంధానంగా ఉంటున్నారు.

ముంబై మహా నగరంలో ఇలా 3 వేల మంది యువత కోవిడ్ సెంటర్లలో గత మూడు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికీ కనీసం 20 వేల రూపాయల వరకు జీతం ఇస్తున్నారు. ఫ్రీ ఫుడ్, వారికి అవసరం అయితే ఫ్రీగా మెడికల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఆస్పత్రులు, కోవిడ్ సెంటర్లలో లక్షల మంది ఉండటంతో అవసరం అయిన వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున యువతకు అవకాశం కల్పించారు.

కోవిడ్ సెంటర్లలో పని చేస్తున్న యువత వయస్సు అంతా 20 నుంచి 30 ఏళ్లలోపే. చాలా కొద్ది సంఖ్యలోనే 40 ఏళ్ల వాళ్లు ఉన్నారు. కరోనా కారణంగా పోయిన ఉపాధిని.. ఈ విధంగా పొందాం అంటున్నారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉద్యోగం చేస్తామని.. అప్పటి వరకు కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెబుతున్నారు ఈ కుర్రోళ్లు..

మీ ప్రాణాలకు ముప్పు కాదా అంటే.. ఆకలి బాధ, ఆకలి చావు కంటే ఇది చాలా బెటర్ అంటున్నారు. పీపీ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు వేసుకుని సేవలు చేస్తున్నామని.. కుటుంబ సభ్యులే పట్టించుకోని ఈ రోజుల్లో.. ఇలాంటి సేవ ద్వారా ఉపాధి పొందటం ఆనందంగా ఉందని చెబుతున్నారు ఈ కుర్రోళ్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు