రాజకీయ వ్యూహాల్లో చతికిల పడిన షర్మిల.. రోజురోజుకు తగ్గుతున్న ఊపు.. దూరం అవుతున్న కార్యకర్తలు

ys sharmila political party

#yssharmila political party : కొత్త పార్టీ.. అందులోనూ వైఎస్ఆర్ కుటుంబం నుంచి వస్తుంది.. ఏపీ సీఎం జగన్ సోదరిగా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయ వ్యూహాల్లో చతికిల పడుతుంది. ప్రారంభంలో ఉన్న ఊపు ఇప్పుడు లేకపోగా.. కరుడుగట్టిన అభిమానులు రోజురోజుకు దూరం అవుతున్నారు. రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన పార్టీ.. వెనక్కి వెళుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన షర్మిలకు మొదట్లో వేలాది మంది కరుడుగట్టిన వైఎస్ఆర్ అభిమానులు తరలి వచ్చారు. పార్టీ కోసం చింపుకుని పని చేస్తామంటూ రంగులు పూసుకుని లోటస్ పాండ్ కు పరిగెత్తారు. 2021, మార్చి నెలలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన షర్మిల.. ఆ తర్వాత జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.

మొదటగా నల్గొండ జిల్లా నుంచి ప్రారంభం అయిన సమీక్షతోనే కిక్ స్టార్ట్ అయ్యింది.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. మొదటి రోజు 10 వేల మంది వస్తే.. ఐదో సమావేశానికి ఐదు వేల మంది సైతం లేరు. ఇక ఇప్పుడు అయితే లోటస్ పాండ్ కళ తప్పిందనే చెప్పాలి. మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్టీ కోసం పని చేస్తామంటూ ముందుకొచ్చిన ఎంతో మంది కుర్రకారు.. ఇప్పుడు కనుమరుగు అయ్యారు. వీళ్లందరూ వైఎస్ఆర్ అభిమానులు కావటం విశేషం.

రాజకీయ వ్యూహాల్లోనూ వైఎస్ షర్మిల చారిత్రక తప్పులు చేస్తుందనే చెప్పాలి. తెలంగాణ వచ్చేసింది.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పాలన గడిచి ఏడేళ్లు అవుతుంది. ఇప్పుడు సైతం ఓదార్పు యాత్రలు, పరామర్శలు అనే పాత చింతకాయ పచ్చడికి కొత్త తాలింపు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి మంత్రం.. బ్రాండ్ వ్యాల్యూ, యువత మద్దతు. ఇది స్పష్టంగా లోపించింది షర్మిల పార్టీకి. పార్టీ పెడతానని చెప్పి మూడు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీని పరామర్శించింది లేదు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఓయూ నుంచి అనేక యువ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి చూడలేదు షర్మిల. ఇదే ఇప్పుడు యువతలో మైనస్ పాయింట్ అయ్యింది.

అవినీతి అంశాన్ని టచ్ చేయలేదు.. అభివృద్ధి మంత్రాన్ని జపించటం లేదు.. రాజకీయ కక్షలపై ప్రశ్నించటం లేదు.. భూముల బాగోతంపై పల్లెత్తి మాట అనటం లేదు.. కుటుంబ పాలనపై దండెత్తటం లేదు.. ఇలాంటి ఎన్నో సమస్యలపై పోరాటాన్ని వదిలేశారనే వాదన వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది.. ఇప్పుడు కావాల్సింది ఓదార్పులు, పరామర్శల యాత్రలు కాదు.. దండయాత్రలు అనే రాజకీయ పోరాట స్ఫూర్తిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విస్మరించిందనే చెప్పాలి. అందుకే అందరూ దూరం అవుతున్నారు. ముఖ్యంగా యువత. మొదటి రోజు సందడి ఇప్పుడు సల్లబడింది.. లోటస్ పాండ్ రహదారులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న అందరూ అవకాశవాదులే అన్న టాక్ బలంగా వినిపిస్తుంది ఔత్సాహిక అభిమాన యువతలో.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు