పక్కా వ్యూహం – ఆ నాలుగు పార్టీలను కన్సిడర్ చేయని షర్మిల.. కొట్లాటకే రెడీ అయ్యింది

షర్మిళ సీఎం కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ : కేసీఆర్ అవినీతి ప్రశ్నించడానికే మన పార్టీ

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు.. పెట్టబోయే పార్టీ ఎలా ఉండబోతుందో ఖమ్మం సభ ద్వారా చెప్పేశారు. బహిరంగ సభ ద్వారా తన మాటల తూటాలు పేల్చిన షర్మిల.. తన టార్గెట్ ఎవరో చెప్పకనే చెప్పేశారు. దీని వెనక పక్కా ప్లాన్, వ్యూహం ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆషామాషీగా ఆమె ఈ ప్రసంగం చేయలేదు.. తన భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ఆవిష్కరించారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీనే తన ప్రత్యర్థి అని.. మనం పోరాడాల్సింది ఆ పార్టీపైనే అని కార్యకర్తలు, అభిమానులు, నేతలకు డైరెక్ట్ గా చెప్పేశారు. 40 నిమిషాల స్పీచ్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ వైఖరిని దుమ్మెత్తిపోశారు. ఇది మామూలు విషయం కాదు.. చాలా వ్యూహాత్మకమైన రాజకీయ అడుగు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడేళ్లు అవుతుంది. మరో మూడేళ్లు పదవిలో ఉంటుంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దీన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలనే ఎత్తుగడ షర్మిలలో చాలా బలంగా కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా తెలంగాణ అసెంబ్లీకి 2023లో అధికారంలోకి రావాలనే లక్ష్యం పెట్టుకున్నా.. అది నెరవేరకపోతే.. కనీసం 25 నుంచి 30 ఎమ్మెల్యేలను గెలిపించి తన సత్తా చాటాలనే వ్యూహం స్పష్టంగా ఆమెలో కనిపించింది.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసిన షర్మిల.. తెలంగాణలో మిగతా నాలుగు పార్టీలను కనీసం కన్సిడర్ చేయకపోవటం చూస్తుంటే.. మిగతా పార్టీల బలం ఏంటో ముందుగానే అంచనా వేసినట్లు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. టీడీపీ చచ్చిపోయింది.. టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయింది.. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు. కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడి.. పార్టీని నాశనం చేసుకుంది. ఇక జనసేన పార్టీ అంటారా.. పోటీ కంటే పొత్తు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇక మిగిలిన ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది జాతీయ పార్టీ. ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతుంది వచ్చే ఎన్నికలకు. బీజేపీకి ఉన్న మైనస్ బీజేపీకి ఉంది. అందుకే ఈ నాలుగు పార్టీలపై పల్లెత్తి మాట అనలేదు షర్మిల.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే లక్ష్యంతోనే జనంలోకి వెళ్లి ఓటర్లను ఆకర్షించాలని బలంగా విశ్వసిస్తుంది. అందుకు తగ్గట్టుగానే స్పీచ్ ఉంది.. భవిష్యత్ రాజకీయం టీఆర్ఎస్ పార్టీతోనే కొట్లాట అని చెప్పేసింది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు