తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి

ysr congress to contest in telangana
  • పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగుతున్న వైసీపీ
  • నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలీ వైసీపీ అభ్యర్థి
  • కేసీఆర్ కు పరోక్ష మద్దతు అంటున్న విశ్లేషకులు
  • కాంగ్రెస్ , బీజేపీ ఓట్లు చీల్చడానికే పోటీలో వైసీపీ

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల ఇప్పటికే పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో షర్మిలకు చెందిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయటం లేదని స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా అన్నకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఏప్రిల్ 17వ తేదీన జరగనుండగా.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మార్చి 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సాగర్‌ ఉప ఎన్నికకు 13 నామినేషన్స్‌ దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌ సింగ్‌ చెప్పగా.. అందులో 12 ఇండిపెండెంట్లు కాగా.. మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు. అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయటం చర్చనీయాంశం అయ్యింది. మిగతా పార్టీలను షాక్ కు గురి చేసింది.

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దుకాణం సర్దేసింది. ఏపీకి మాత్రమే పరిమితం అయ్యింది. తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. జగన్ తన పార్టీని తెలంగాణలో బరిలోకి నిలపకుండా.. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు. వైసీపీ సానుభూతిపరులు అందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జగన్ సోదరి.. షర్మిల పార్టీ ప్రకటించారు. ఈ పరిణామాలతో జగన్ అభిమానులందరూ తెలంగాణలో షర్మిలకు మద్దతు ఇస్తారని భావించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయటం ఊహించని షాక్ అంటున్నారు రాజకీయ నేతలు.

షర్మిలకు పోటీగా.. అన్న జగన్ పార్టీ సైతం తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వటంతో మిగతా రాజకీయ పార్టీలు గందరగోళంలో పడ్డాయి. ఏపీకి సరిహద్దుల్లో ఉండే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏపీ సెటిలర్లతోపాటు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్లందరూ ఇప్పటి వరకు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు జగన్ బరిలోకి దిగుతుండటంతో.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలి.. టీఆర్ఎస్ పార్టీకి లబ్ధిచేకూర్చవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే మరోసారి సీఎం కేసీఆర్ కు.. జగన్ పార్టీ పరోక్షంగా గిఫ్ట్ ఇచ్చినట్లే.. కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టినట్లే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు