నారాయణ, చైతన్య కాలేజీల ర్యాంకుల్లా పెట్రోల్ , డీజిల్ ధరలు దేశం 85,86,90,93, 100 అన్న రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో పెట్రోల్ రేటు 100.13 రూపాయలకు చేరుకోని చరిత్రలో రికార్డు నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రల్లో సైతం పెట్రోల్, డీజిల్ రేట్లు ఇదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా రాకెట్ లాగా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ ధర లీటరు 93.10 రూపాయలకు చేరుకుంది. రోజుకు 20 పైసల చొప్పున ఇదే విధంగా పెరుగుదల కొనసాగితే మార్చి నాటికి హైదరాబాద్ లో కూడా 100కి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక డీజిల్ ధర అయితే ఏకంగా 87.20 రూపాయలకు చేరుకుంది.
20 నుండి 30 పైసల మధ్య సవరణ
రోజువారీ సవరణల్లో భాగంగా ఆయిల్ సంస్థల్ రేట్లను సరాసరి 26 పైసల నుండి 36 పైసల మధ్య చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న క్రూడ్ ఆయిల ధరలను , అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. రోజు వారి సవరణల్లో భాగంగా పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రతి నెల భారం ఇలా – లెక్క చూస్తే మధ్యతరగతికి భయమే
గతంలో 250 రూపాయలు పెడితే మూడు లీటర్ల వరకు వచ్చే పెట్రోల్ వచ్చేది, ప్రస్తుతం 250 ఇదే మూడు లీటర్ల పెట్రోల్ కొనడానికి సరాసరి 280 వరకు అవుతుంది. అంటే ప్రతి మూడూ లీటర్ల మీద 30 రూపాయలు అదనం. అంటే నెలకు సగటున ఒక వ్యక్తి 30 లీటర్లు వాడిన 300 రూపాయలు అదనంగా భారం పడుతుంది.
ఇక ఒక ట్యాక్సీ లేదా ఓక ఆటో డ్రైవర్ నెలకు సగటున 500 – 1000 లీటర్ల మధ్య ఇంధనం వాడితే వారికి సరాసరి నెలకు 1600 నుండి మూడు వేల వరకు అదనంగా భారం పడుతుంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి అతను రేట్లను పెంచడమే లేక లాభాన్ని తగ్గించుకోవడమో చేయాలి. ఒక సాధారణ డ్రైవర్ తన ఆదాయంలో ప్రతి నెల ఇంత పెద్ద మొత్తాన్ని కోల్పోవడం సాధారణ విషయం కాదు.