
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయి.. కొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ వస్తుంది.. కరోనా అంతం అయిపోతుంది అనుకుంటున్న టైంలో ప్రపంచం మొత్తం షాక్ అయ్యే విషయం బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కు కరోనా వైరస్ సోకింది.
ఈ విషయాన్ని శనివారం ఆయన అధికారికంగా.. తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం అంబాలాలోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మూడో దశ ట్రయిల్స్ లో భాగంగా.. వాలంటీర్ గా నవంబర్ 20వ తేదీన ఆయన కరోనా టీకా వేయించుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా తీసుకున్న తర్వాత.. మూడో దశ ట్రయిల్స్ లోనూ టీకా పని చేయకపోవటం అందరినీ షాక్ కు గురిచేసింది. కోవాగ్జిన్ టీకా వేయించుకున్న తర్వాత కూడా మంత్రి అనిల్ విజ్ కరోనా బారిన పడటంతో.. టీకాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.