కరోనాకు రూ.18 లక్షల బిల్లు వేశారు.. బిల్లు కడితేనే మృతదేహం ఇస్తాం

తెలంగాణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి అద్వానంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు లేవు. ప్రైవేటుకు పోదామంటే బిల్లుల మోత.. ఇక చాలామంది ఎటు వెళ్లలేక ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారు.. ప్రాణం పోయిన పర్వాలేదు కానీ ప్రభుత్వాసుపత్రికి పోమంటున్నారు కొందరు కరోనా రోగులు. ప్రభుత్వం అది చేశాం ఇది చేశామని లెక్కలు చెబుతున్న ఆసుపత్రులకు వెళ్లి చూస్తే అన్ని వట్టిమాటలే అనిపిస్తున్నాయి.

రోగులు సెల్ఫీ వీడియోలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దోగొప్పో ఆర్థిక స్తొమత ఉన్న కరోనా బాధితులు ప్రైవేట్ దవాఖానాలకు పోతున్నారు. అక్కడ బిల్లు చూస్తే గుండెపోటు వచ్చేలా ఉంది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా దందా నడిపిస్తున్నాయి.. మందే లేని రోగానికి లక్షల్లో బిల్లు చేతులో పెడుతున్నాయి. కాగా బుధవారం జరిగిన ఓ ఘటన అందరిని కలచివేస్తుంది.

సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సత్యనారాయణ రెడ్డి అనే కరోనా పేషెంట్ కు ఏకంగా 18 లక్షల బిల్ వేశారు. అయినా కూడా ఆయనకు బ్రతికించలేకపోయారు. కాగా ఇందులో సగం బిల్ చెల్లించారు. అయితే మొత్తం బిల్ ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. దింతో మృతదేహం కోసం పడిగాపులు కాస్తున్నారు బంధువులు. కాగా గత వారం కరోనా బారినపడి సత్యనారాయణరెడ్డి భార్య, కుమారుడు మృతి చెందాడు.

ఇప్పుడు సత్యనారాయణరెడ్డి కూడా మృతి చెందటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో రోజుల వ్యవధిలో మహమ్మారి భారిన పడి ముగ్గురు మరణించడమంటే చాలా బాధకలిగించే విషయం. కాగా ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయని అయిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు