రాగి పాత్రల్లో నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. తప్పదు మరి… ప్రస్తుత సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకోసం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యం బాక్టీరియా, వైరస్ భారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గతి తప్పిన జీవన విధానంతో ఇప్పుడు మనం అవస్థలు పడుతున్నాం కానీ… ఒక్కసారి మన పూర్వీకుల అలవాట్లు వారి పద్ధతులు తెలుసుకుంటే మన భారతీయ జీవన విధానం ఎంత గొప్పదో అర్ధమౌతుంది. వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది త్రాగు నీరు గురించి… ఎందుకంటే మన రోజువారీ జీవితం ఒక చెంబు త్రాగు నీరు సేవించడంతోనే మొదలైయ్యేది.

రాగి చెంబులో నీరు త్రాగడం

రాగి పాత్రలో నీళ్లు త్రాగడం అనేది వేలాది సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయంగా వస్తుంది. వేల సంవత్సరాల క్రితం మునులు, ఋషులు ఈ రాగి పాత్రను తమ వెంట ఉంచుకుని అందులో నీటిని సేవించేవారు. కాలక్రమేణా అది మన సంప్రదాయంలో భాగమైంది. అయితే ఇలా రాగి పాత్రల్లో నీటిని సేవించడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. రాగి పాత్రల్లో నీరు ఉంచినప్పుడు…ఆ నీరు రాగితో చర్య జరిపి నీటిలో ఉండే అన్ని రకాల సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. తద్వారా సురక్షితమైన నీరు మన శరీరానికి అందుతుంది. సురక్షితమైన నీరు త్రాగడం వలన మన శరీరంలోని చెడు బాక్టీరియా చనిపోతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. అంతే కాదు మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి అందాలంటే అందుకు రాగి ఎంతో అవసరం.

రాగి పాత్రలో నీరు ఎంతసేపు ఉంచాలి

సాధారణ నానుడి ప్రకారం రాత్రి పడుకునేముందు రాగి పాత్రలో నీరు ఉంచుకుని, మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీరు త్రాగడం మంచిది. రాగి పాత్రలో పోసిన నీటిలో ఉండే బాక్టీరియా, వైరస్ లు నశించేందుకు కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఆతరువాత కొద్ది కొద్దిగా రాగి ఆ నీటిలో చేరుతుంది. ఇక ఆరు గంటల పాటు రాగి పాత్రలో నీరు ఉంచడంవలన శరీరానికి హానికలిగించే అన్నిరకాల వైరస్ లను చంపేస్తుందని నిరూపితమైంది. సాధారణంగా మన శరీరానికి ఒకరోజుకు 900 మైక్రో గ్రాముల రాగి అవసరమౌతుంది. ఒక రాత్రంతా రాగి పాత్రలో నీరు ఉంచడం వలన 500 మైక్రోగ్రాముల రాగి లభిస్తుంది. మిగిలినది మనం తీసుకునే ఆహారం నుండి లభిస్తుంది.

ఎటువంటి రాగి పాత్రను తీసుకోవాలి

రాగి నీరు త్రాగడంవలన జీర్ణ క్రియ మెరుగౌతుంది. అయితే ఎప్పుడుపడితే అప్పుడు నీరు త్రాగడం కాకుండా, ఒక క్రమ పద్దతిలో త్రాగితే మంచి ఫలితాలు ఉంటాయి. రాగి నీరు త్రాగడం వలన మరెన్నో లాభాలు ఉన్నాయని పాశ్చాత్త దేశాలోని పరిశోధకులు సైతం నిరూపించారు. అయితే రాగి పాత్రను ఎంచుకునే విధానానికి కూడా ఒక పద్ధతి ఉంది. మాములుగాయితే రాగి పాత్రను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. పైన రాగి పూతతో లోపల స్టీల్ ఉన్న పాత్రలు మార్కెట్లో లభ్యమౌతున్నాయి. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి, కడిగే శ్రమ తప్పుతుందని హోటల్స్, రెస్టారెంట్లలో అటువంటి పాత్రలనే ఉపయోగిస్తున్నారు అటుంవటి పాత్రలో నీరు త్రాగడం వలన అంతగా ఉపయోగం ఉండదు. పూర్తిగా రాగితో చేయబడిన పాత్రను ఎంచుకోవాలి. అసలు సిసలైన రాగి కాస్త బరువు తక్కువగా ఉంటుంది. మిల మిల మెరిసిపోతూ ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు