జుట్టు సమస్యకు ఇంటిలోనే పరిష్కారం

“జుట్టు”… ఏకవచనంతో చెప్పాలంటే వెంట్రుక. దేనైనా తక్కువగా పోల్చాలంటే “నా వెంట్రుకతో సమానం” అంటు మనం వెంట్రుకను తేలిగ్గా తీసిపారేస్తాం. కానీ జుట్టు ఎంత విలువైనదో… జుట్టు పై నడుస్తున్న వ్యాపార గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జుట్టు సంబంధిత ఉత్పత్తులపై జరుగుతుంది. దువ్వెన, షాంపు, విగ్ ఇలా రకరకాల ఉత్పత్తులతో పాటు బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామంటూ జుట్టు సంబంధిత ఆసుపత్రులు కూడా పెరిగాయి. ఇప్పుడర్ధమైందా జుట్టు ఎంత విలువైనదో.

ఇక జుట్టును కాపాడుకోవడానికి మనం చేయని ప్రయత్నాలు లేవు. ఒకదాన్ని మించి మరొకటి అన్ని రకాల ఉత్పత్తులను ప్రయత్నించి విసిగి వేసరిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే హానికారక రసాయనాలు ఉండే ఇలాంటి ఉత్పత్తులు జుట్టుపై అతిప్రభావం చూపుతాయి. ఎటువంటి హాని కలిగించకుండా ఇంటిలో ఉండే వాటితోనే జుట్టు సమస్యలకు పరిస్కారం దొరుకుతుంది. వెంటనే ఫలితాలు కనిపించవు, కానీ రెండు మూడు నెలలు ఈ చిట్కాలను పాటిస్తే జుట్టు సమస్యలు తీరిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది.

ఉసిరి, కుంకుడుకాయ, షీకాకాయ్:

జుట్టు బాగా ఒత్తుగా పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉసిరి, కుంకుడుకాయ మరియు షికాకైలను మన భారతీయులు విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వీటిని జుట్టు పోషణకు వాడుతున్నారు. దాదాపు అన్ని సాధారణ జుట్టు సమస్యలను పరిష్కరించడమే కాక, కురులకు బలాన్ని ఇస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికేవి కాబట్టి వీటివలన జుట్టుకు ఎటువంటి హాని జరగదు. పైగా షాంపులకంటే ఇవి చాల ధర తక్కువ. ఈ మూడిటితో మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

> రాత్రి పడుకునే ముందు 6 కుంకుడుకాయలను, 6 ముక్కలు షికాకై, 3 ఉసిరి కాయలను నీటిలో నానబెట్టండి.
> మరుసటి రోజు ఉదయం, నీటిని వడకట్టి, ఈ మూడింటిని కలిపి కొద్దిగా ఉడికించండి.
> కొంత సేపు చల్లార్చిన అనంతరం మూడింటిని కలిపి పేస్ట్ రూపంలో ముద్దలా తయారు చేసుకోండి
> ఈ పేస్ట్ తో వారానికి రెండు సార్లు తల స్నానం చేయండి. ఇలా కనీసం పది వారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి

భ్రింగరాజ్, కొబ్బరినూనె మిశ్రమం

జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు భ్రింగరాజ్ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. భ్రింగరాజ్, కొబ్బరినూనెతో చేసే మిశ్రమాన్ని ఉపయోగించడం వలన బట్టతలపై కూడా జుట్టు వస్తుందంటూ కొందరు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది నిజం. తరతరాలుగా భ్రింగరాజ్ నూనెను జుట్టు పోషణలో ఉపయోగిస్తున్నారు భారతీయులు. ఇందులోని సహజగుణాలు చుండ్రును నివారించి, తెల్లజుట్టును నిరోధించి జుట్టును మృదువుగా చేస్తుంది. ఇక ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

> భ్రింగరాజ్ ఆకులు రెండు గుప్పెడులు తీసుకోండి. వాటిని మెత్తగా నూరి గిన్నెలో ఉంచండి. (భ్రింగరాజ్ పౌడర్‌ను కూడా
ఉపయోగించవచ్చు). 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో చేర్చండి.
> ఒక బాణలిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేడి చేసి, నూరిన భ్రింగరాజ్ పేస్ట్ ను కలపండి.
> ఈ మిశ్రమాన్ని సుమారు 3-5 నిమిషాలు వేడి చేయండి. ద్రావణాన్ని వడకట్టాల్సిన అవసరం లేదు
> మిశ్రమం చల్లబడిన తర్వాత ఒక సీసాలో నింపి వారానికి 2 లేదా 3 సార్లు మీ జుట్టుపై మసాజ్ చేయండి

అలోవెరాతో జుట్టు మిల మిల

ప్రకృతి సహజ సిద్ధంగా లభించిన మరో చక్కని పదార్ధం అలోవెరా. అన్ని ప్రాంతాల్లోనూ అలోవెరా విరివిగా లభ్యమౌతుంది. అలోవెరా గుజ్జును సౌదర్య సంబంధిత ఉత్పత్తుల్లో బాగా వాడుతారు. ఈ మొక్కలో మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి. చర్మం మరియు జుట్టులోని తేమను రక్షించేందుకు అలోవెరా ఉపయోగపడుతుంది. అలోవెరా గుజ్జును నేరుగా జుట్టుకు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టు ఎంతో కండిషన్ లో ఉంటుంది.

> అలోవెరా మొక్క నుంచి ఒక కాడ అలోవెరాను తీసుకోండి. కాడను మధ్యగా కోసి అందులోని గుజ్జును మాత్రమే తీసి పెట్టుకోండి

> అలా తీసిన గుజ్జుకు అర స్పూన్ కొబ్బరి నూనెను కలిపి, జుట్టుకు రాసుకోండి(జుట్టు అంచుల వరకు అవసరం లేదు)

> 20 నిముషల తరువాత తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు ఎంతో మృదువుగా ఉంటుంది.

ప్రస్తుతం చెప్పినవన్నీ ప్రకృతి సిద్ధంగా లభించేవే కాబట్టి శరీరానికి, జుట్టుకు ఎటువంటి హాని జరగదు. కనీసం రెండు నెలలు ఈ చిట్కాలను పాటించి చూడండి. మంచి ఫలితాలు పొందొచ్చు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు