ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ గా నీలం సాహ్ని పేరు ఖరారు అయ్యింది. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 31వ తేదీతో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగుస్తుంది. అతని స్థానంలో కొత్త కమిషనర్ నియామకం కోసం.. ప్రభుత్వం ముగ్గురి పేర్లను గవర్నర్ కు పంపించింది. నీలం సాహ్నితోపాటు.. శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను సూచించింది. ఈ ముగ్గురిలో.. నీలం సాహ్ని పేరును కన్ఫామ్ చేసింది రాజ్ భవన్. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో గవర్నర్ బిశ్వభూషణ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
నీలంసాహ్ని ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. గతంలో చీఫ్ సెక్రటరీగా పని చేశారు. ఆమెను ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చి.. చీఫ్ సెక్రటరీని చేసింది కూడా సీఎం జగన్. చీఫ్ సెక్రటరీ పదవీ కాలం ముగిసిన వెంటనే.. సలహాదారుగా నియమించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ముగింపుతో.. ఆ స్థానంలో నీలం సాహ్ని పేరుతో ఫస్ట్ ప్రయార్టీ కింద సిఫార్సు చేశారు సీఎం జగన్. అందులో భాగంగానే ఆమెను నియమిస్తూ.. గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే అధికారిక ఉత్తర్వులు రావటానికి రెండు, మూడు రోజుల సమయంల పట్టవచ్చు.
1984వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీగా పని చేశారు. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా.. 2018లో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.