సీఎం జగన్ కొత్త కేబినెట్ రెడీ అవుతుందా.. ఆశావహులు వీళ్లే.. కరోనా ఏమైనా చేయొచ్చు..

సీఎం జగన్ కొత్త కేబినెట్ రెడీ అవుతుందా.. ఆశావహులు వీళ్లే.. కరోనా ఏమైనా చేయొచ్చు..

రెండున్నరేళ్లలో అందర్నీ మార్చేస్తా.. పనితీరు ఆధారంగా మార్పులు ఉంటాయి.. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన వారు ఆ తర్వాత పార్టీకి పని చేయాలి.. ఈ రెండున్నరేళ్లు పార్టీకి పని చేసిన వారు ఆ తర్వాత మంత్రి పదవిలోకి వస్తారు.. రెండేళ్ల క్రితం పార్టీ అధ్యక్షుడిగా సీఎం జగన్ చెప్పిన మాట.. ఇప్పుడు ఆ టైం దగ్గర పడుతుంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న సీఎం జగన్ కేబినెట్ లోకి కొత్త ముఖాలు వస్తాయని టాక్ వినిపిస్తుంది ఆ పార్టీలోనే..

రెండేళ్లుగా మంత్రి పదవిలో ఉన్నా.. హోదాను అనుభవించలేకపోయాం అని.. ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయాం అంటున్నారు ప్రస్తుత మంత్రులు. కరోనాతో మొదటిసారి ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నాం.. అంతా సర్దుకుంటున్న సమయంలో రెండోసారి కరోనా వచ్చింది. మంత్రి పదవిలో ఉండి కూడా హోదాను అనుభవించలేకపోవటం ఒకటి అయితే.. మంత్రిగా చేయాల్సిన పనులను చాలా వరకు చేయలేకపోయాం అనే ఆవేదన మంత్రుల్లో ఉందంట. రెండేళ్లే కరోనాతో పోయింది అనే బాధలో ఉన్నారంట ప్రస్తుత మంత్రులు. అలా అని సీఎం జగన్ నిర్ణయాన్ని ధిక్కరించే దమ్మూ, దైర్యం చేయలేరు కాబట్టి.. దీన్ని ఓ రిక్వెస్ట్ గా తీసుకోవాలని మాత్రం చెబుతున్నారు ప్రస్తుత మంత్రులు.

మొదటి విడతలోనే మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు.. రెండున్నరేళ్లు ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మొదటి లిస్ట్ లో మిస్ట్ అయిన వాళ్లతోపాటు సామాజిక సమీకరణల్లో భాగంగా ఈసారి పక్కా ఛాన్స్ అని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఆశావహులు లిస్ట్ ఇలా ఉంది :

అంబటి రాంబాబు, కాకాని గోవర్థన్ రెడ్డి, పార్థసారధి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, రాజన్న దొర, ముత్యాల నాయుడు, జక్కంపూడి రాజా, హఫీజ్ ఖాన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఇక మహిళల కోటా కింద రోజా, విడుదల రజిని, ఉండవల్లి శ్రీదేవిలు ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అనే ఫీలింగ్ లో ఉన్నారు. సామాజిక కోణంగా తప్పకుండా వస్తుందని భావిస్తున్నారు.

ఎవరు ఎన్ని ఈక్వెషన్స్ వేసుకున్నా సీఎం జగన్ ఆలోచన ముందు అన్నీ పటాపంచలే అవుతాయని.. గత కేబినెట్ కూర్పు చూస్తేనే అర్థం అవుతుంది. వైసీపీ గెలిస్తే మంత్రి పదవి గ్యారెంటీగా వీళ్లకు వస్తుంది అనుకున్న వారిలో 50 శాతం మంది ఔట్ అయ్యారు. ఈసారి ఎలాంటి ఈక్వేషన్స్ తెరపైకి తీసుకొస్తాయో.. ఎవర్ని మంత్రి పదవి వరిస్తుందో అనేది ఆసక్తి.

అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. కరోనా వల్ల మరికొంత కాలం వాయిదా పడొచ్చు.. మరో ఏడాది వీళ్ల పదవులను కొనసాగించొచ్చు లేదా అనుకున్నట్లే రెండున్నారేళ్లకు కొత్త మంత్రులు రావొచ్చు. ఏమైనా జరగటానికి ఇంకా నాలుగు నెలల సమయం పూర్తిగా ఉంది…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు