ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ – మరో రెండేళ్లు లేనట్లే

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ - మరో రెండేళ్లు లేనట్లే.. ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు బయటపడింది.

andhra pradesh government stop new districts process

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లాగా మొత్తం 25 జిల్లాలు చేస్తామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు బయటపడింది.

దేశవ్యాప్తంగా 2022 నాటికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఇందుకు సంబంధించి ఏడాది క్రితమే విధానం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే NCC, NRC తీసుకొచ్చింది. జనాభా లెక్కలు ప్రారంభం అయిన కొన్ని రోజులకే కరోనా వైరస్ రావటంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇప్పటికీ కరోనా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకే ఆదేశాలు జారీ చేసింది. జనాభా లెక్క పూర్తయ్యే వరకు ఆయా రాష్ట్రాలు జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్ విభజన చేయొద్దని స్పష్టం చేసింది.

కొత్త జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన కూడా జరగాల్సి ఉందని.. మొత్తం ప్రక్రియను ఒకేసారి చేపట్టాలని.. పదేపదే వద్దని రాష్ట్రాలకు సూచించింది. కేంద్రం ఆదేశాలతో ఏపీలోని సీఎం జగన్ ప్రభుత్వం జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటును పక్కనపెట్టింది.

కొత్త జనాభా లెక్క వచ్చిన తర్వాత అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకోనుంది. ఇదంతా పూర్తి కావటానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. 2024 ఎన్నికల నాటికి కొత్త జిల్లాలు ఏర్పడతాయా లేదా అనేది సందేహమే.. అప్పటి వరకు 13 జిల్లాలుగానే కొనసాగనుంది ఏపీ రాష్ట్రం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు