పవన్ కల్యాణ్ పై అమిత్ షాకు బీజేపీ నివేదిక.. వెన్నుపోటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు..

janasena pawan kalyan and bjp

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం తర్వాత.. పవన్ కల్యాణ్ వైఖరిపై ఏపీ బీజేపీలో అంతర్మథనం మొదలైంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఘోర ఓటమిపై సమీక్ష చేసిన ఏపీ బీజేపీ.. అందుకు సంబంధించి హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలకు నివేదిక ఇచ్చారు నేతలు.

తిరుపతి ఉప ఎన్నికలో ఘోర ఓటమి వెనక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నాడని.. నమ్మించి గొంతు కోశాడని.. మోసం చేశాడంటూ పెద్ద పదాలు వాడినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడిచారని.. అందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని నివేదికలో స్పష్టం చేశారు నేతలు.

ఒప్పందం ప్రకారం.. తిరుపతి ఎన్నికలో పవన్ కల్యాణ్ ఆరు రోజులు ప్రచారం చేయాల్సి ఉంది.. అయితే ఒకే ఒక్క ర్యాలీ, సభతో సరిపెట్టారూ.. ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మెరుగైన ఫలితం వచ్చేది.. కావాలనే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేదని నివేదిక ఇచ్చారంట.

బయటకు పొత్తు ఉన్నట్లు కనిపించినా.. లోలోపల మాత్రం పవన్ కల్యాణ్ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చారు. 2019లో జనసేన పార్టీకి 12 వేల 300 ఓట్లు వస్తే.. 2021 ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 11 వేల 500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో జనసేనకు పడిన ఓట్లు సైతం.. ఇప్పుడు బీజేపీకి పడలేదని.. జనసేన కార్యకర్తలు ఎవరూ బీజేపీ ఓటు వేయలేదంటూ నివేదికలో స్పష్టం చేశారు బీజేపీ నేతలు.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా వివాదంలో.. కేంద్ర కమిటీ సభ్యుడు సునీల్ దేవదర్ జనసేనకు సంపూర్ణ మద్దతు ప్రకటించినా.. పవన్ కల్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదని.. బీజేపీ నేతలకు కనీస మద్దతు ఇవ్వలేదన్నారు.

చంద్రబాబు వెనకుండి పవన్ కల్యాణ్ ను నడిపిస్తున్నారని.. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన వెన్నుపోటు పొడించిందని.. సీఎం అభ్యర్థిగా ప్రకటించినా.. జనసేన నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవటం దారుణం అంటూ అమిత్ షా, నడ్డాకు నివేదిక ఇచ్చారు ఏపీ బీజేపీ నేతలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు