జగన్ కు జై.. పాలాభిషేకాలు చేసిన తెలంగాణ ఉద్యోగులు

జగన్ కు జై.. పాలాభిషేకాలు చేసిన తెలంగాణ ఉద్యోగులు

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ ఉద్యోగులు జై కొట్టారు.. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేయటంతోపాటు పాలాభిషేకం చేశారు. ఏపీ సచివాలయంలో మార్చి 31వ తేదీ బుధవారం ఈ వేడుక జరిగింది.

తెలంగాణ స్థానికత కింద.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు కేటాయించారు 711 మంది ఉద్యోగులను. ఈ ఉద్యోగులు అందరూ ఏడేళ్లుగా ఏపీలో పని చేస్తున్నారు. అప్పటి నుంచి తెలంగాణకు వెళ్లిపోతాం అని పదేపదే కోరినా ఫలితం లేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల రిలీవ్ కు సంబంధించి చర్చలు జరిగినా ఫలితం లేదు.

జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలంగాణ ఉద్యోగులు అందరూ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏడాది క్రితమే వీరిని ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆగిపోయింది. మార్చి 31వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ 711 మంది ఉద్యోగులను తీసుకోవటానికి అంగీకరించటంతో.. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేశారు.

తెలంగాణ ఉద్యోగులందరూ క్లాస్‌-3, క్లాస్‌-4 క్యాడర్ కు చెందినవారే. 711 మంది ఉద్యోగులందరినీ రిలీవ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణకు వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు కుటుంబం ఒకచోట.. ఉద్యోగం ఒక చోటతో చాలా ఇబ్బందులు పడ్డాం అని.. ఏడేళ్లు నలిగిపోయాం అంటున్నారు ఉద్యోగులు. సీఎం జగన్ మానవత్వంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటూ.. తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు