బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉందామా ?నాయకులకు చంద్రబాబు సంకేతాలు ?

బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉందామా ?నాయకులకు చంద్రబాబు సంకేతాలు ?

ఏపీలో వరస ఎన్నికలు అధికార పార్టీలో జోష్ తీసుకొస్తుంటే.. ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే జెడ్పీ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కంటే.. ఓట్ల శాతంపైనే చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తుంది ఆ పార్టీ. ఇంతలో మరో ఉప ఎన్నిక. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో చనిపోయారు. అంటే మరో ఉప ఎన్నిక ఖాయం అయ్యింది.

రాబోయే ఆరు నెలలలోపు ఎప్పుడైనా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలంటే బొప్పి కట్టించుకుంటున్న టీడీపీ.. బద్వేల్ ఉప ఎన్నికపై ఎవరూ మాట్లాడొద్దని సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. తొందరపడి ఎవరికి వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని.. ఇప్పటికే కొందరు అత్యుత్సాహంతో కామెంట్లు చేస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని స్పష్టమైన సంకేతాలు వెల్లడించారు.

నిత్యం ఎన్నికలతో పార్టీ నిర్మాణంపైనే కాదు.. అధికార పార్టీ వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని.. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా సెంటిమెంట్, అధికార పార్టీ దౌర్జన్యాలతో గెలుపు కష్టమని.. అందు కోసం టైం వేస్టు చేసుకోకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారంట.

గతంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చిన క్రమంలో.. అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేసేవి. అదే సంప్రదాయాన్ని బద్వేల్ లో కొనసాగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేసేది లేదని.. ఎవరూ మాట్లాడొద్దని కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. దీన్ని బట్టి చూస్తుంటే బద్వేల్ బరి నుంచి టీడీపీ తప్పుకోనున్నట్లు స్పష్టం అయ్యింది.

మరి బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తాయా లేక చనిపోయిన సానుభూతిపై తప్పుకుంటాయా చూడాలి. ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత ఈ రెండు పార్టీ వైఖరి స్పష్టం కానుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు