సీబీఐ, సీఐడీ, ఏసీబీ కస్టడీలో : ఒకే రోజు విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబు ఆప్తులు టీడీపీ ఉక్కిరిబిక్కిరి

tdp supporters in jail

చంద్రబాబు కుడి, ఎడమ భుజాలన్నీ ఒకేసారి విచారణలో.. చుట్టూ ఏం జరుగుతుంది అనే ఆందోళనలో ఉన్నాయి టీడీపీ శ్రేణులు.

దెబ్బ మీద దెబ్బ.. అన్నీ ఒకేసారి మీద పడినట్లు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఊహించని విధంగా వసరగా కీలక నేతలు అందరూ చక్రవ్యూహంలో ఇరుక్కున్నట్లు ఫీలవుతున్నారు కార్యకర్తలు. ఒకే రోజు.. ముగ్గురు కీలక నేతలు, టీడీపీకి వెన్నుదన్నుగా.. ముఖ్యంగా చంద్రబాబుకు కుడి, ఎడమ భుజాలుగా ఉండే వారు విచారణలకు హాజరుకావటం.. కోర్టుల్లో సైతం వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు రావటంపై పార్టీలోనే చర్చ జరుగుతుంది.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర.. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏసీబీ అరెస్ట్ చేయటం.. కోర్టు రిమాండ్ విధించటం చకచకా జరిగిపోయాయి. విచారణ, అరెస్ట్ పై క్వాష్ పిటీషన్ వేసిన నరేంద్రకు అనుకూలంగా తీర్పు వస్తుందని అందరూ భావించారు. విచారణ ఎదుర్కోవాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతోపాటు బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. అక్కడితోనే షాక్ అయిన టీడీపీకి.. మరో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్ కు సమ్మతిస్తూ.. మే 4వ తేదీ వరకు నాలుగు రోజులు విచారణకు అనుమతించింది కోర్టు. మే ఒకటో తేదీ నుంచి 4వ తేదీ వరకు ధూళిపాళ్లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు.

ఇక రెండో అంశం.. దేవినేని ఉమ. మూడో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లిన దేవినేని ఉమ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ కాకుండా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకురావటంతో ఈజీగా బయటపడొచ్చని భావించారు టీడీపీ శ్రేణులు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వరసగా మూడు రోజులు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ పేరుతో సీఐడీ కార్యాలయంలోనే ఉంటున్నారు దేవినేని ఉమ. దీనికితోడు విచారణ తర్వాత ఉమ చేస్తున్న వ్యాఖ్యలు అయన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి. చంద్రబాబు పేరు చెప్పమని అధికారులు బలవంతంగా చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరణతో షాక్ అయ్యారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. దేవినేని ఉమ లాయర్ సమక్షంలో.. ఆన్ రికార్డ్ కెమెరా ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నామని.. చంద్రబాబు పేరు చెప్పాలని డిమాండ్ చేస్తే.. టీడీపీ లాయర్ ఖండించొచ్చు.. కోర్టులో చెప్పొచ్చు కదా అంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కాక డైలమాలో పడ్డారు టీడీపీ నేతలు..

మూడో అంశం.. బొల్లినేని గాంధీని విచారణ కోసం సీబీఐ కస్టడీలోకి తీసుకోవటం. చంద్రబాబుకు అత్యంత ఆప్తులు ఈ బొల్లినేని గాంధీ. చంద్రబాబు హయాంలోనే ఇతను ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు.. ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు బాస్ అయ్యారు. అప్పట్లో జగన్ పై నమోదు చేసిన ఈడీ కేసులన్నీ ఇతని ఆధ్వర్యంలోనే జరిగాయి.. జగన్ ఫ్యామిలీ మొత్తాన్ని గాంధీ వేధింపులకు గురి చేస్తున్నాడని కేంద్రానికే కంప్లయింట్ చేశాడు గాంధీ. ఇదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో, సమక్షంలో గాంధీ చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుంచే విమర్శలు చేస్తూ వస్తుంది. చంద్రబాబుకు ఎంతో ఆప్తుడు అయిన బొల్లినేని గాంధీ ఇప్పుడు.. సస్పెండ్ అయ్యి.. సీబీఐ అరెస్ట్ చేయటంతోపాటు.. ఏకంగా కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తోంది. 5 కోట్ల రూపాయల లంచం కేసులో గాంధీని అరెస్ట్ చేసింది సీబీఐ.

మే ఒకటో తేదీన.. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు సీబీఐ, సీఐడీ, ఏసీబీ కస్టడీలో విచారణ ఎదుర్కోవటంతో చంద్రబాబు కలత చెందినట్లు తెలుస్తోంది. కుడి, ఎడమ భుజాలుగా ఉంటూ వస్తున్న వారు.. ఒకేసారి ఇబ్బందుల్లో పడటం పార్టీ శ్రేణులు సైతం బాధతో ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు