రాజ్యసభ రేసులో మెగా బ్రదర్స్.. జోరుగా ప్రచారం..

రాజ్యసభ రేసులో మెగా బ్రదర్స్.. జోరుగా ప్రచారం..

రాజ్యసభ రేసులో మెగా బ్రదర్స్.. జోరుగా ప్రచారం..

తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రదర్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా, రాజకీయం పరంగా మెగా బ్రదర్స్ పవర్ చూపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెగా బ్రదర్స్ లోని ఇద్దరు రాజ్యసభకు వెళ్లబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలతోపాటు సినీ రంగంలోకి చర్చకు దారి తీసింది. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యి.. కేంద్ర మంత్రిగా పని చేశారు చిరంజీవి. 2019 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతోపాటు రాజ్యసభ పదవీకాలం పూర్తయిన క్రమంలో.. ఆయన రాజకీయాల జోలికి వెళ్లటం లేదు.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అడపాదడపా ప్రభుత్వ పథకాలను కీర్తిస్తూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. ఇప్పటికే మూడు సార్లు జగన్ తో భేటీ అయ్యి.. సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చించారు కూడా. జగన్ – చిరంజీవి మధ్య మంచి టర్మ్స్ ఉన్నాయనే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయాలని ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపించటానికి కావాల్సిన పూర్తి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బీజేపీకి దగ్గరగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఆయన తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేశారు. సీటును త్యాగం చేశారు. ఎమ్మెల్యేగా నిలబడి రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయాలని చూస్తుందంట. రాష్ట్రపతి కోటాలో పంపించాలని సన్నాహాలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనికి పవర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 2022, ఏప్రిల్ నెలలో ఏడు రాజ్యసభ సీట్లు కాబోతున్నాయి. ఇవన్నీ రాష్ట్రపతి కోటాలో భర్తీ చేయాల్సి ఉన్నవి. ఏపీ నుంచి పవన్ కల్యాణ్ ను ఎంపిక చేయటానికి సరైన బలం లేదు బీజేపీకి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపించి.. జనసేన – బీజేపీ బంధాన్ని బలోపేతం చేయాలని బీజేపీ వ్యూహం రచించింది. 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఏపీలో బలపడాలి అంటే.. కాపు సామాజిక వర్గం ఓట్లను తన వైపు తిప్పుకోవాలంటే పవన్ కల్యాణ్ మద్దతు కంపల్సరీ బీజేపీకి. ఈ లెక్కలన్నీ ఆలోచించి బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెగాబ్రదర్స్ ఇద్దరూ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు