సూపర్ సీఎం కేసీఆర్ : మంత్రిగా ఈటెల బర్తరఫ్.. 24 గంటల్లోనే భూ కబ్జా కేసు తేల్చేశారు.. జెట్ స్పీడ్

తెలంగాణ ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తుందో.. ఏదైనా కంప్లయింట్ వస్తే మెరుపు వేగంతో సమస్యను పరిష్కరిస్తుందో చెప్పటానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇది.. ప్రస్తుతానికి ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ భూ కబ్జాపై రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై జెట్ స్పీడ్ తో పని చేసింది ప్రభుత్వం. జస్ట్ 24 గంటల్లోనే.. వాయువేగంతో.. జెట్ స్పీడ్ తో అన్నీ తేల్చేయటం అబ్బురపరుస్తోంది.

ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈటెల భూ కబ్జా అని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. గంటలోపే బాధిత గ్రామానికి వెళ్లిపోయిన మీడియా.. బాధితుల గోడును ప్రపంచానికి చూపించింది. రైతుల గోడు విని చలించిపోయిన సీఎం కేసీఆర్.. కరోనా ట్రీట్ మెంట్ ను సైతం పక్కనపెట్టి.. ఈటెల రాజేందర్ భూ కబ్జాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆదేశించారు.

మే ఒకటో తేదీ ఉదయం అంటే.. 16 గంటల్లోనే మెదక్ కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ. బాధిత రైతుల నుంచి వివరాలు సేకరించింది. వివాదంగా మారిన 110 ఎకరాలపై డ్రోన్ కెమెరాలతో సర్వే చేసింది ప్రభుత్వం. ఓ వైపు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తూనే.. మరోవైపు అత్యాధునిక పద్దతిలో సర్వే చేశారు అధికారులు.

అధికారుల పనితీరు చూసిన తర్వాత న్యాయం జరుగుతుందని భావించిన వందల మంది రైతులు, ఈటెల రాజేందర్ బాధితులు అధికారుల దగ్గర క్యూ కట్టారు. తండోపతండాలుగా బాధితులు రావటంతో అవాక్కయిన అధికారులు.. విచారణను అత్యంత వేగంగా పూర్తి చేయటానికి అదనపు సిబ్బందిని నియమించుకుని.. స్థానిక ఎమ్మార్వో ఆధ్వర్యంలో అక్కడికక్కడే రికార్డుల పరిశీలన, పోస్టుమార్టం పూర్తి చేశారు.

మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అయితే.. మూడు గంటల్లోనే అంటే.. సాయంత్రం 5 గంటలకల్లా తన నివేదికను, బాధితులకు జరిగిన అన్యాయాన్ని పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఈ నివేదిక ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటెల రాజేందర్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ ఆమోదం కూడా అయిపోయింది. శాఖలేని మంత్రిగా ఉన్న ఈటెలను.. కేబినెట్ నుంచి తొలగిస్తారా లేక ఈటెల రాజీనామా చేస్తారా అనేది చూడాలి.

ఈటెల రాజేందర్ భూ కబ్జాపై 24 గంటల్లోనే విచారణ పూర్తి చేయటం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు ప్రజలు. రైతుల కష్టంపై, రైతుల ఫిర్యాదులపై సూపర్ స్పీడ్ గా పని చేసి న్యాయం చేసిన సీఎం కేసీఆర్ సూపర్ అంటున్నారు బాధిత రైతులు. ఈ-గవర్ననెన్స్, రైతులు, ప్రజల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించే తీరు అమోఘం అంటున్నారు ప్రజలు.

ఇదే స్పీడ్ తో కరోనాను కట్టడి చేయాలని చివరగా చేతులు జోడించి విన్నవించుకోవటం అంటే రాజకీయమే అవుతుంది కదా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు