తెలంగాణలో కరోనా తీవ్రంగా ఉంది.. మంత్రి ఈటెల అధికారిక ప్రకటన..

తెలంగాణలో కరోనా తీవ్రంగా ఉంది.. మంత్రి ఈటెల అధికారిక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తోంది.. ఏప్రిల్ 17వ తేదీ ఒక్క రోజే కేసులు 6 వేలకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ పదేపదే అలర్ట్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ మహా నగరంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని హెచ్చరిస్తూ వస్తున్నారు.

కరోనా కేసులు అరికట్టేందుకు.. కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరారు మంత్రి ఈటెల. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణకు వ్యాక్సిన్ కొరత ఉందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ పదేపదే కోరుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేదు. వ్యాక్సిన్ లేకపోవటంతో.. ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం వ్యాక్సిన్ ప్రక్రియ మొత్తం నిలిచిపోయిందన్నారు మంత్రి.

వ్యాక్సిన్ కొరత మాత్రమే కాదు.. ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని.. కేంద్రం దీనిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు మంత్రి ఈటెల. కరోనా రోగులకు అత్యవసరంగా ఇచ్చే రెమ్ డెసివిర్ ఇంజక్షన్ కొరత లేకుండా చూస్తున్నామని.. వీటి సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరారు మంత్రి.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని మంత్రి ఈటెల మాటలతో జనం భయాందోలనలో పడ్డారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్, ఆక్సిజన్, మందుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని మంత్రి ఈటెల చెబుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ సమీక్ష పెట్టారా.. కేంద్రాన్ని ప్రశ్నించారా వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరతపై లేఖ అయినా రాశారా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రతిపక్షాలు ఎటూ లేవు కాబట్టి.. ప్రజలే ప్రశ్నించుకుంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎటూ ప్రశ్నించదు.. కాంగ్రెస్ లేదు.. టీడీపీ కనుమరుగు అయ్యింది.. ఇక ప్రజలే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు