రైతులకు సిరులు కురిపిస్తున్న గో మాత

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసిన ఆవులే కనిపించేవి. కానీ రాను రాను వాటి సంఖ్య తగ్గిపోతుంది. రైతులు యాంత్రికరణపై దృష్టిపెట్టడంతో.. ఆవులను.. ఎద్దులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు గ్రామాల్లో ఆవులు కనపడితే వింతగా చూస్తున్నారు చిన్నారులు. పోషణ ఖర్చు అధికం కావడంతోనే చాలామంది ఆవులను అమ్మేశారు. గోవు ద్వారా వచ్చే ఆదాయం తెలియకనే ఈ విధంగా చేశారు రైతులు.. ఇక ఇప్పుడిప్పుడే గోవులపై మక్కువ పెంచుకుంటున్నారు. ఇంట్లో ఒక్క గోవైనా ఉంటే మంచిదని భావించి కొనుగోలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆవులను పెంచుకున్న వ్యక్తులు ఇప్పుడు లాభపడుతున్నారు. రసాయన ఎరువుల కారణంగా భూమిలో సారం తగ్గిపోవడంతో పంట దిగుబడి అమాంతం తగ్గింది. దింతో రైతులు పాత పద్దతి వైపు మొగ్గుచూపుతున్నారు. ఆవు ఎరువులపై దృష్టిపెట్టి వాటిని తమ పొలాల్లో రాత్రి నిద్ర చేయిస్తున్నారు. ఆలా ఒక వంద ఆవులు, ఎద్దులు ఉన్న మంద రైతులు పొలంలో నిద్ర చెయ్యాలి అంటే రోజుకు ఆరువేల నుంచి ఎనిమిది వేల రూపాయాలు తీసుకున్నారు మంద యజమానులు. దింతో వంద ఆవుల మంద ఉన్న రైతు వారానికి రూ.50 వేలు సంపాదిస్తున్నారు. ఈ ఆవుల నిద్రల వ్యాపారంలో తాము లాభాన్ని ఆర్జిస్తున్నామని చెబుతున్నారు రైతులు.

కాగా ఈ పద్దతి జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని జరుగుతుంది. ఈ ప్రాంతంలోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్‌ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి.

పంట సాగుకు నెల ముందు నుంచి ఆవుల మందల కోసం రైతులు క్యూ కడతారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇలా చెయ్యడం వలన రసాయనాలు వాడాల్సిన పని ఉండదు. ఇది కూడా ఒకరకంగా సేంద్రియ వ్యవసాయం కిందకే వస్తుంది.

రైతులకు సిరులు కురిపిస్తున్న గో మాత

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు