సీఎం కేసీఆర్.. ఈటెలను అరెస్ట్ చేయిస్తారా.. వదిలేస్తారా.. ఏం జరగబోతుంది

KCR

టీఆర్ఎస్ సీనియర్ నేత, శాఖలు లేని మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ భూ కబ్జాపై.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కబ్జా నిజమని తేల్చారు. అనైన్డ్ భూములను ఈటెల రాజేందర్ బెదిరించి.. బలవంతంగా లాక్కున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. బాధితులు సైతం అధికారుల ఎదుట ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో భూములను సర్వే చేసి మరీ.. 48 గంటల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేశారు కలెక్టర్.

అసైన్డ్ భూముల్లోని చెట్లను అనుమతి లేకుండా తొలగించారని.. ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ ఆధీనంలోనే అసైన్డ్ భూములు ఉన్నట్లు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అంతే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సైతం ఎగ్గొట్టారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా తన నివేదికలో స్పష్టం చేశారు కలెక్టర్. సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అనధికారికంగా ఫౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని ఈటెల రాజేందర్ పై సీరియస్ అభియోగాలు నమోదు చేశారు నివేదికలో..

ఈటెల రాజేందర్ తప్పు చేశారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కలెక్టర్ నివేదిక స్పష్టంగా చెప్పటంతో.. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. మంత్రిగా ఉన్న అతన్ని తొలగించి.. అరెస్ట్ చేసి జైలుకు పంపించే సూచనలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఎలాంటి యాక్షన్ తీసుకునే ఉద్దేశం లేకపోతే ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు కదా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలే.

ఈటెల రాజేందర్ ను అరెస్ట్ చేయాలా లేదా అనేది సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంది. అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా అనేది సైతం ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశంతో ఓటు నోటు ద్వారా మాజీ సీఎం చంద్రబాబు అడ్డంగా బుక్ అయినా.. ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశారు సీఎం కేసీఆర్. అందుకు ప్రతిఫలంగా రాత్రికి రాత్రి తెలంగాణను వదిలేసి వెళ్లిపోయారు చంద్రబాబు. ఇప్పుడు కూడా చంద్రబాబు లాంటి ఆప్షన్ ఏమైనా ఈటెల రాజేందర్ కు.. సీఎం కేసీఆర్ ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది అతి త్వరలోనే తేలిపోనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు