ఈటెల పార్టీ పెడతారా -బీజేపీలోకి వెళతారా : టచ్ లోకి వెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి

etela and kond over a phone call

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఈక్వెషన్స్ తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం.. టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి అందులోనే ఉండి కొట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్.. ఇప్పుడు భూ కుంభకోణం ఆరోపణల్లో ఇరుక్కున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ విచారణకు సైతం ఆదేశించారు. దీనిపై మంత్రి ఈటెల స్పందించారు. ఆత్మగౌరవం కంటే పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు టీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదని ఆయనే స్పష్టం చేసినట్లయ్యింది.

ఇప్పుడు ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. సహజంగా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి.. బడుగు, బలహీన వర్గాల కోసం కొట్లాడే తత్వం ఉన్న మనస్తత్వం.. యుద్ధం కంటే రాజీ మార్గం ఎంతో ఉపయుక్తం అని భావించే సౌమ్యుడు ఈటెల. అలాంటి వ్యక్తి బీజేపీ పార్టీలో ఇమడలేరు అని అతని అనుచరుల మాట. బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ కులం నుంచి ఎదిగిన మనిషి. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కమ్మ, రెడ్డి, వెలమ కులం వాళ్లే పరిపాలించారు. వారి ఆధ్వర్యంలోనే పార్టీలు నడుస్తున్నాయి. తెలంగాణ బీసీలు అత్యధికంగా.. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలి అనేది డిసైడ్ చేసేవాళ్లు వీళ్లే. అలాంటి సామాజిక వర్గం కావటంతో.. సొంత పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచన సైతం ఈటెల రాజేందర్ కు ఉందంట.

తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై మంచి పట్టు ఉంది. కనీసం 21 నియోజకవర్గాల్లో తన ప్రాబల్యం చాటుకోగలడనే అంచనా ఉంది. ఇలాంటి సమయంలో మరో పార్టీలోకి వెళ్లటం కంటే.. ఆత్మగౌరవంగా కొత్త పార్టీని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన సైతం చేస్తున్నారంట ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావటం కూడా ఈటెలకు ప్లస్ పాయింట్ కావొచ్చు.

ఈ విషయం తెలిసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. ఈటెల టచ్ లోకి వెళ్లారంట. మొదటగా భూ కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు, వార్తలు, ప్రభుత్వ వైఖరిపై సానుభూతి వ్యక్తం చేయటంతోపాటు.. వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలిపారంట కొండా విశ్వేశ్వరరెడ్డి.

పరిస్థితులు చక్కబడిన తర్వాత ఓసారి కలవాలని.. చర్చించాలని ఈటెలను కోరారంట కొండా విశ్వేశ్వరరెడ్డి. సమయం, వీలు చూసుకుని చెబుతాను అని ఈటెల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు