ఈటెల అన్నది మంత్రి మల్లారెడ్డి గురించే కదా.. ఆయనకు ప్రత్యేక న్యాయమా..

etela rajender

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్.. తన వెర్షన్ వినిపించటానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. హైదరాబాద్ లో స్కూటర్ పై తిరిగే అతను.. ఇప్పుడు వేల కోట్లు సంపాదించలేదా.. భూ కబ్జాలు చేయలేదా అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్.. ఇంతకీ ఆ స్కూటర్ పై తిరిగిన వ్యక్తి ఎవరు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది..

స్కూటర్ పై తిరుగుతూ వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఎవరో కాదు.. మంత్రి మల్లారెడ్డి అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలే. స్కూటర్ పై పాల వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి.. ఆ తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన వందల కోట్లు సంపాదించారు. ఆ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ పెట్టారు. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలు మారినా.. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో జాయిన్ అయిపోతారు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. తనను ఏమీ చేయలేరనే ధీమా, భరోసా మల్లారెడ్డిలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అతను డబ్బున్నోడు అంటారు అందరూ.

ఈటెల చేసిన వ్యాఖ్యలు మల్లారెడ్డి గురించే అని స్పష్టంగా అంటున్నారు తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు. ఆ స్కూటర్ పై తిరిగింది మల్లారెడ్డే అని.. ఇటీవల అధికార పార్టీకి చెందిన టీవీ9 ఛానల్ లో మల్లారెడ్డి భూ దందాపై వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. ఫోన్ లీక్ అయ్యింది. అడ్డంగా దొరికిన మల్లారెడ్డిపై కనీస చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. పార్టీ నుంచి వివరణ కూడా లేదు.

ఈటెల రాజేందర్ కు ఇక్కడే మరింత ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేసింది. స్కూటర్ పై తిరిగిన వ్యక్తి వేల కోట్లు సంపాదించటమే కాదు.. నెల రోజుల క్రితం రియల్ దందాలో స్వయంగా ఇరుక్కున్న మల్లారెడ్డిపై కనీస చర్యలు తీసుకోలేదని ప్రెస్ మీట్ సాక్షిగా స్పష్టంగా చెప్పకనే చెప్పారు. అగ్ర కులానికి చెందిన వారు అడ్డంగా దొరికినా చూసీచూడనట్లు వదిలేసిన సీఎం కేసీఆర్.. ఎలాంటి విచారణకు ఆదేశించలేని ప్రభుత్వం.. తనను మాత్రం టార్గెట్ చేయటం చూస్తుంటే పొమ్మనలేక పొగ పెట్టినట్టే అని అంటున్నారు ఈటెల.

ఇదే న్యూస్ ఛానళ్లు, ఇవే పత్రికలు మల్లారెడ్డి రియల్ దందా ఆడియో వేశాయి.. వాటిని లైట్ తీసుకున్న సీఎం కేసీఆర్.. ఈటెలపై చకచకా విచారణలు వేయటం వెనక ఉద్దేశం ఏంటో అందరికీ ఇప్పుడు స్పష్టం అవుతుంది.. మొత్తానికి స్కూటర్ పై తిరిగిన మల్లారెడ్డే కదా.. ఇప్పుడు వేల కోట్లు సంపాదించింది.. దానికి ఈ స్కూటర్ సాక్ష్యం ఇదిగోండీ.

See also : ఈటెల పార్టీ పెడతారా -బీజేపీలోకి వెళతారా : టచ్ లోకి వెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి

See also : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి సైతం ఈటెల రాజీనామా : కేసీఆర్ తో పూర్తిగా తెగతెంపులు..

 

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు