కేసీఆర్ కూ కుటుంబం ఉంది-బెదరటానికి నేనేమైనా బచ్చానా ఏంటీ : ఎమ్మెల్యేకు రాజీనామాకు సిద్ధం.. వార్నింగ్ ఇచ్చేసిన ఈటెల

etela rajender press meet over suspension

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయటం.. ఆగమేఘాలపై తన భూములపై నివేదిక తయారు కావటం.. తన ఫౌల్ట్రీ భూముల్లో బోర్డులు పెట్టటంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. మే 3వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వైఖరి ఏంటో చెప్పకనే చెబుతూ.. సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చేశారు.

కేసీఆర్ తో కలిసి ఉన్న ఈ 19 సంవత్సరాల్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని.. కొత్తగా ఎలాంటి వ్యాపారాలు చేయలేదన్నారు ఈటెల. అసైన్డ్ భూములు లాక్కుంటే కచ్చితంగా శిక్షకు సిద్ధం అని.. అది తేల్చాల్సింది కోర్టులు అని స్పష్టం చేస్తూనే.. భూ ఆక్రమణలు జరిగితే ముందుగా నోటీసులు ఇస్తారని.. ప్రభుత్వం అలా చేయలేదని.. కనీసం తన వివరణ ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతుందని.. అసైన్డ్ భూములు కొనుక్కున్న నేను శిక్షకు అర్హుడినే అన్నారు.

కేసీఆర్ చేతిలో ఇవాళ రాజ్యం ఉండొచ్చు.. ఆ రాజ్యం శాశ్వతం కానీ.. కేసీఆర్ కాదు కదా అంటూ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది చెప్పకనే చెప్పారు. రాజ్యం అనేది చాలా శక్తివంతమైనది.. బలమైనదని.. ఇందులో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ చేతిలో అధికారం ఉంది కదా అని ఏది చేస్తే అది నడవదని.. సీఎం కేసీఆర్ కు కూడా కుటుంబం ఉందని.. కేసులు, కుట్రలు చేస్తే భయపడే చిన్నవాడిని కాదని.. బెదిరిపోవటానికి నేనేమైనా చిన్నవాడినగా.. బచ్చాగాడిని కాదంటూ తన సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఈటెల రాజేందర్.

నమస్తే తెలంగాణ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు తన భూమి అమ్మి మరీ డబ్బులు ఇచ్చానని.. అలాంటి నన్నే ఇవాళ ఇలా చేస్తున్నారంటే కేసీఆర్ కుటుంబం వైఖరి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. తెలంగాణ భవన్ కోసం చేసిన పోరాటం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పదవుల కోసం ఆత్మగౌరవం ముఖ్యం అని.. కేసీఆర్ – ఈటెల మధ్య దూరం ఎందుకు వచ్చిందో మా ఇద్దరికే తెలుసన్నారు.

గత ప్రభుత్వంలో సివిల్ సప్లయ్ మంత్రిగా ఉన్నానని.. ఆ విషయంలో కూడా నాపై కచ్చితంగా ఆరోపణలు, విమర్శలు, కుట్రలు బయటకు వస్తాయని.. దానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు ఈటెల రాజేందర్.

కారు గుర్తుపై పోటీ చేసి గెలిచానని.. అవసరం అయితే.. అంత దూరం వస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలను ఎదుర్కొంటానంటూ సంచలన ప్రకటన చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు