Fact Check : తిరుమల తలనీలాల రగడలో అసలు నిజం ఇది…

తిరుమల తలనీలాల రగడలో అసలు నిజం ఇది
  • తిరుమల తలనీలాల విషయంలో విషప్రచారం
  • తిరుమల తలనీలాల రగడలో అసలు నిజం ఇది
  • ఎన్నికల నేపథ్యంలో కల్పించిన కట్టు కథ – అసలు నిజం చెప్పే కథనం ఇది

తిరుమల శ్రీవారికి మొక్కుగా భక్తులు సమర్పించే తలనీలాలను చైనా, మయన్మార్ దేశాలకు స్మగ్లింగ్ అవుతుందని.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రమేయం ఉందంటూ కొన్ని పత్రికలు, ఛానళ్లలో వస్తున్న కథనంపై ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. దీని వెనక ఏం జరిగింది.. ఎందుకు వివాదం అయ్యింది.. వివాదం చేసింది ఎవరు.. దీని వెనక ఉన్న కుట్ర ఏంటీ.. ఏది నిజం .. ఏది అబద్ధమో తెలుసుకుందాం..

2021, ఫిబ్రవరి 7వ తేదీన మిజోరాం రాష్ట్రం ఐజ్వాల్ గ్రామ సరిహద్దు దగ్గర భారత భద్రతా బలగాలు తనిఖీలు చేశాయి. రెండు లారీల్లో.. 120 బ్యాగుల్లో.. 3 వేల 240 కేజీల వెంట్రుకలను గుర్తించారు. దీనికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో.. అస్సాం రైఫిల్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ తల వెంట్రుకలను మయన్మార్ దేశానికి చెందిన స్టీవెన్సన్.. మన దేశానికి చెందిన ముంగ్ సియాన్ సింగ్ అనే వ్యక్తితో 15 వేల రూపాయల రవాణా ఖర్చుల కింద బేరం కుదుర్చుకున్నాడు. మొత్తం వెంట్రుకల విలువ 18 లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా వేసింది కస్టమ్ విభాగంగా. ఈ మేరకు ఫిబ్రవరి 8వ తేదీనే కేసు నమోదు చేసి విచారణ చేట్టింది.

గత నెలలో ఈ వార్తను కొన్ని ఇంగ్లీష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది కాకపోవటంతో ఎవరూ పట్టించుకోలేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతుండటం, ఆ పరిధిలోనే ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన తిరుమల ఆ పరిధిలోనే ఉండటంతో.. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వ్యక్తులు దీన్ని తిరుమల దేవస్థానంతో ముడిపెట్టి వార్తలు రాశారు. దీంతో ఇది పార్టీల మధ్య వివాదంగా మారింది. అవి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలని.. స్మగ్లింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై టీటీడీ స్పందించింది. భక్తులు సమర్పించే తలనీలాలను ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని.. ఆయా కంపెనీలు ఏం చేసుకుంటాయో తెలుసుకోలేం అని.. స్మగ్లింగ్ అవుతున్న తల వెంట్రుకలు తిరుమలకి చెందినవి అయితే ఆయా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని.. దీనికి సంబంధించి కస్టమ్స్ నుంచి ఎలాంటి కంప్లయింట్, విచారణ జరగలేదని స్వయంగా ప్రకటించింది.

టీటీడీ ప్రకటన తర్వాత అస్సాం రైఫిల్స్ – కస్టమ్ విభాగం సైతం స్పందించింది. గతనెలలో పట్టుబడిన తలనీలాలు అని.. ఇవి తిరుమలకు చెందినవి కావని.. వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలని కస్టమ్స్ రిపోర్టులో లేదని.. ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుందో తెలియదని వెల్లడించింది. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా కల్పితం అని.. కస్టమ్స్ విభాగం రిపోర్టులో తిరుమల ప్రస్తావన లేదని.. ఉత్తరాది రాష్ట్రాల్లో బార్బర్ షాపుల నుంచి సేకరించిన తల వెంట్రుకలు అని వివరించింది.

మొత్తంగా ఈ వివాదంలో టీటీడీ ప్రమేయం ఎక్కడా లేదని స్పష్టం అవుతున్నా.. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రతిష్టపై.. భక్తుల మనోభావాలపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఏపీ, తెలంగాణ ప్రజలు నివ్వెరపోతున్నారు. అన్నీ తెలిసిన వేంకటేశ్వరస్వామికి ఏది నిజం.. ఏది అబద్ధమో తెలియదా.. ఆయనే చూసుకుంటాడు.. ఆయనే బుద్ధి చెబుతాడు అంటున్నారు భక్తులు. తప్పుడు ప్రచారం.. వేంకటేశ్వరస్వామిపై తప్పుడు కథనాలు రాసే వారిని ఆయనే దండిస్తాడంటున్నారు భక్తులు..

ఇదండీ అసలు సంగతి.. ఏది నిజం.. ఏది అబద్ధమో.. ఎవరు చేస్తున్నారో.. ఎవరు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారో తెలిసిపోయింది కదా.. మీరు కూడా మీ బాధ్యతగా.. వేంకటేశ్వరస్వామిపై భక్తితో నిజం తెలుసుకున్నారు కదా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు