జగన్ – అతని మధ్య గ్యాప్ వచ్చిందా – గుంటూరు రాజకీయంలో తిరుపతి ఉపఎన్నిక పై చర్చ

జగన్ - అతని మధ్య గ్యాప్ వచ్చిందా - గుంటూరు రాజకీయంలో తిరుపతి ఉపఎన్నిక పై చర్చ

జగన్ చెప్పాడంటే చేస్తాడు.. మాట తప్పడు.. మడమ తిప్పడు అంటారు అతని అభిమానులు. అనుకున్నట్లుగానే.. అందరికీ అన్ని చేశాడు. చివరికి తిరుపతి ఉప ఎన్నికలో తనకు ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న గురుమూర్తికి సైతం పిలిచి ఎంపీ సీటు ఇచ్చారు. ఎవరూ ఊహించని.. అంచనా వేయలేని నిర్ణయం ఇది. ఇక్కడే అందరికీ ఒకే ఒక్క క్వశ్చన్ రైజ్ అవుతుంది. ముఖ్యంగా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది.

2019 ఎన్నికలకు ముందు చిలకలూరిపేట ప్రచారంలో జగన్ ప్రచారం చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తాను అని బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకపోయినా.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తా అని ప్రకటించారు. జగన్ కోరుకున్నట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. జగన్ సీఎం అయ్యారు. మంత్రి వర్గం కొలువుదీరింది. అందులో మర్రి రాజశేఖర్ కు అవకాశం దక్కలేదు. పదవిలో లేకుండా అయినా మంత్రి పదవి ఇవ్వొచ్చు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చేయొచ్చు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో సైతం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. అందులోనూ మర్రి రాజశేఖర్ పేరు లేదు.

ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో.. మరోసారి గుంటూరులో మర్రి రాజశేఖర్ టాపిక్ జనంలో టాక్ అయ్యింది. గురుమూర్తిని పిలిచి టికెట్ ఇచ్చారు.. అలాంటిది బహిరంగ సభలో ప్రకటించిన మర్రి రాజశేఖర్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు జగన్.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అని చర్చించుకుంటున్నారు. మరో వాదన కూడా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే రజిని కాదని మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇవ్వలేకపోతున్నారా ఏంటీ అని కొందరు అంటుంటే.. అంత సీన్ లేదు.. జగన్ అనుకుంటే ఏమైనా జరిగిపోతుంది.. కాకపోతే ఎక్కడో ఏదో తేడా వచ్చింది అనే చర్చ జరుగుతుంది జనంలో. తిరుపతి ఉప ఎన్నిక మరోసారి గుంటూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసిందనేది మాత్రం నిజం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు