క్లయిమాక్స్ లో చేతులెత్తేసిన బీజేపీ.. తిరుపతిలో చల్లబడిన కాషాయదళం..

క్లయిమాక్స్ లో చేతులెత్తేసిన బీజేపీ.. తిరుపతిలో చల్లబడిన కాషాయదళం..

BJP Hicommand not happy by tirupati election campaign
BJP Hicommand not happy by tirupati election campaign

క్లయిమాక్స్ లో చేతులెత్తేసిన బీజేపీ.. తిరుపతిలో చల్లబడిన కాషాయదళం..

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో అందరి కంటే ముందు.. తొడలు కొట్టింది.. మాటల తూటాలు పేల్చింది ఎవరో తెలుసా.. బీజేపీ పార్టీనే. తిరుపతి లోక్ సభ సీటును గెలిచి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ బుసలు కొట్టింది. అందరి కంటే ముందు రంగంలోకి దిగి.. నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశాలు నిర్వహించింది.

అంతేనా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు.. జనసేన పవన్ కల్యాణ్ తో ర్యాలీ, సభ నిర్వహించింది. పవన్ కల్యాణ్ కాబోయే సీఎం అంటూ కీర్తించింది. వకీల్ సాబ్ మూవీకి మద్దతుగా నిలిచి జనసేనతో.. కుల సమీకరణను దృష్టిలో ఉంచుకుని పవన్ తో వ్యాఖ్యలు చేయించింది. తెలంగాణకు చెందిన బండి సంజయ్, రఘునందన్ రావు వంటి వారితో తిరుపతిలో ప్రచారం చేయించింది. ఇదంతా నిన్నా.. మొన్నటి వరకు..

కీలకమైన క్లయిమాక్స్ లో.. పోలింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే ఉన్న సమయంలో.. బీజేపీలో ఒక్కసారిగా నీరసం ఆవహించినట్లు కనిపిస్తుంది. ప్రముఖుల పర్యటనలు అన్నీ అయిపోవటంతో.. స్థానిక నేతలే ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు, పోల్ మేనేజ్ మెంట్ వ్యవహారాలపై నేతలు దృష్టి పెట్టటంతో.. ప్రచారంలో చోటామోటా నేతలు తిరుగుతున్నాయి. దీంతో మైలేజ్ తగ్గిపోయింది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ.. బీజేపీ ప్రచార సభలు వెలవెలబోతున్నాయి. పవన్ కల్యాణ్ రెండోసారి ప్రచారానికి వస్తారని భావించినా.. కరోనా క్వారంటైన్ కారణంగా ఆగిపోయారు. ఇక అమిత్ షా వస్తారని భావించినా.. అతను పశ్చిమబెంగాల్ లోనే ఉండిపోయారు.

తెలంగాణలోని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో.. కేంద్ర మంత్రులు, నాయకులు పెద్ద సంఖ్యలో దిగిపోయారు. తిరుపతిలో అలా జరగటం లేదు. దీనికితోడు నడ్డా వచ్చిన సమయంలో.. రాష్ట్ర నేతల మధ్య సమన్వయలోపం.. బూత్ కమిటీల ఏర్పాటులో అలసత్వం.. కార్యకర్తలు, నేతల మధ్య గ్యాప్ ఉందనే విషయాన్ని ఎత్తిచూపి అక్షింతలు వేశారంట. ఇవన్నీ చూసిన బీజేపీ హైకమాండ్.. తిరుపతిలో గెలుపు తర్వాత సంగతి.. పరువు నిలుపుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నడ్డా పర్యటన ముగిసిన తర్వాత.. బూత్ కమిటీలపై దృష్టి పెట్టిన వీర్రాజు లాంటి అగ్రనేతలు.. ప్రచారానికి లోకల్ లీడర్స్ ను పంపిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో జనం నుంచి రెస్పాన్స్ రావటం లేదంట.

పోలింగ్ కు వారం ముందు ఏ పార్టీకి అయినా కీలకం.. అలాంటి క్లయిమాక్స్ లో బీజేపీ చేతులెత్తేసింది.. తిరుపతిలో చల్లబడిన కాషాయ దళం అనే వార్తలు వస్తుండటం.. నియోజకవర్గం పరిధిలో ఇలాంటి వ్యాఖ్యలు వినిపించటం ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఇతర అగ్రనేతలు అందరూ తిరుపతిలోనే మకాం వేశారు. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తిరుపతిపైనే ఫోకస్ పెట్టారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవటంలో ముందున్న జోష్.. రానురాను చప్పబడిపోవటంతో ఆందోళన కలిగించే అంశం. అదే జీహెచ్ఎంసీ, దుబ్బాకలో అయితే పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ బీజేపీకి అనుకూలంగా వచ్చింది.. అందుకు భిన్నంగా తిరుపతి పరిస్థితి ఉంది.. అందుకే అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ఎవరూ ప్రచారానికి రాలేదనేది నిజం…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు