అమరావతి రాజధాని అంశంలో హైకోర్టు ఊహించని నిర్ణయం – జగన్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా

amaravathi capital land issue

ఆంధ్రప్రదేశ్ కు ఒక్కటే రాజధాని ఉండాలి.. అది అమరావతి మాత్రమే కావాలి అంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన రైతులు వేసిన పిటీషన్లపై.. మార్చి 26వ తేదీ శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అదే విధంగా రాజధాని కేంద్రంగా అమరావతిలోని భూముల అంశంపై దాఖలైన అనేక పిటీషన్లపై ఏడాది కాలంగా విచారణ జరుగుతుంది. శుక్రవారం హైకోర్టు ఈ కేసుల విచారణపై ఊహించని నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం.. కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే ఈ పిటీషన్లపై విచారణ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వం – రైతుల మధ్య వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పు వచ్చే క్రమంలో.. చీఫ్ జస్టిస్ గా ఉన్న జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలీ కావటంతో తుది వాదనలతోపాటు తీర్పు వాయిదా పడింది. ఈ అంశాలపై శుక్రవారం చీఫ్ జస్టిస్ గోస్వామి బెంచ్ విచారణ చేపట్టింది. రెండు పక్షాల నుంచి మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటాం అని.. అందుకు సన్నద్ధం కావాలని ఆయా న్యాయవాదులను ఆదేశించింది.

2021, మే 3వ తేదీ నుంచి విచారణ ప్రారంభం అవుతుందని హైకోర్టు స్పష్టం చేయటంతో తీర్పు రావటానికి నాలుగు, ఐదు నెలలు పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి వాదనలు కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలతో అమరావతి ప్రాంత రైతులు షాక్ అయ్యారు. రాజధాని తరలింపు అంశం ఈసారి ప్రభుత్వం అనుకూలంగా వస్తుందా ఏంటీ అనే చర్చ అప్పుడే మొదలైంది. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వస్తుందని భావించిన అమరావతి రైతులు.. కొత్తగా మొదటి నుంచి వాదనలు వింటాం అని హైకోర్టు ధర్మాసనమే స్పష్టం చేయటంతో.. తీర్పు ఎలా ఉంటుందనే ఆందోళన నెలకొంది.

గత చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలీ సమయంలో అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలకటమే కాకుండా.. వాదనలు జరిగే ప్రతిరోజూ చీఫ్ జస్టిస్ వెళ్లే రహదారిలో ప్రత్యేక విన్నపాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలనే పునరావృతం చేస్తారా ఏంటీ రైతులు అనేది మిగతా వారిలో ఆసక్తి రేపుతోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు