చావుబతుకుల మధ్య 400 ప్రాణాలు : పంజాబీ దాబాలో నిద్రపోతున్న ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్-బెజవాడలో అర్థరాత్రి హైటెన్షన్

vijayawada oxygen lorry

ఏ మాత్రం అలసత్వం చూపించినా.. నిర్లక్ష్యంగా ఉన్నా.. లైట్ తీసుకున్నా.. మే 7వ తేదీ శుక్రవారం ఉదయానికి విజయవాడ నగరం ప్రపంచవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అయ్యేది.. 400 మంది మరణాలతో దేశం ముందు.. ప్రపంచం ఎదుట దోషిగా నిలబడేది ఏపీ ప్రభుత్వం. సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించటంతో పెను ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడింది ప్రభుత్వం.. 400 మంది ప్రాణాలు.. వివరాల్లోకి వెళితే…

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేషన్ పై 400 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మే 7వ తేదీ శుక్రవారం ఉదయానికి ఆక్సిజన్ అయిపోతుందని.. అధికారులు, వైద్య సిబ్బందికి సమాచారం ఉంది. ఈ క్రమంలోనే.. 18 టన్నుల ఆక్సిజన్ కోసం ఆర్డర్ చేశారు. ఒరిస్సా రాష్ట్రం అంగుల్ నుంచి 18 టన్నుల ఆక్సిజన్ తో ట్యాంకర్ బయలుదేరింది. ట్యాంకర్ బయలుదేరినప్పటి నుంచి జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేస్తూ వచ్చారు.

మే 6వ తేదీ గురువారం అర్థరాత్రి సమయంలో జీపీఎస్ సిస్టమ్ తో ట్యాంకర్ లింక్ కట్ అయ్యింది. ఎలాంటి సమాచారం లేదు. ఏదో జరిగింది అని భయపడిన అధికారులు.. ట్యాంకర్ ఎక్కడుందో కనిపెట్టాలంటూ అర్థరాత్రి సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. పరిస్థితి సీరియస్ ను అర్థం చేసుకున్న పోలీస్ కమిషనర్.. అప్పటికప్పుడు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా ఎస్పీలకు ఫోన్లు చేసి అలర్ట్ చేశారు. జీపీఎస్ కట్ అయిన లాస్ట్ లొకేషన్ తూర్పుగోదావరి జిల్లా అని చెబుతూనే.. ఎందుకైనా మంచిది అని మిగతా జిల్లాలను సైతం అప్రమత్తం చేశారు.

ఆయా జిల్లాల ఎస్పీలు వెంటనే.. జాతీయ రహదారిపై ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు, పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి సమయంలో.. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం గ్రామం దగ్గర ఓ పంజాబీ దాబాలో ట్యాంకర్ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ ను పట్టుకుని ప్రశ్నించారు. లాంగ్ జర్నీ వల్ల అలసటకు గురయ్యానని.. డ్రైవింగ్ చేసే ఓపిక లేదని ఆ డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్ బాధను అర్థం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ.. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్ నడపగల సామర్థ్యం ఉన్న ఓ పోలీస్ అధికారితోపాటు మరో హోంగార్డ్ ను ట్యాంకర్ డ్రైవర్ కు సాయంగా ఏర్పాటు చేశారు.

విజయవాడ ఆస్పత్రిలో ఆక్సిజన్ అత్యవసరం, 400 మంది ప్రాణాలకు ఉన్న ముప్పును గుర్తించిన పోలీసులు.. ధర్మవరం నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. కర్ఫ్యూ కారణంగా ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్నా.. జాతీయ రహదారి కావటంతో వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. దీంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ ను ఉదయం 5 గంటల సమయానికి ఆస్పత్రికి చేర్చారు.

ఆస్పత్రి సిబ్బంది, ట్యాంకర్ ట్రాకింగ్ చేస్తున్న సిబ్బంది, పోలీసులు స్పందించిన తీరుతో 400 మంది ప్రాణాలు నిలబడ్డాయి.. లేకపోతే ఏం అయ్యేదో.. తలచుకుంటేనే భయమేస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు