ఇక నుంచి 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్

ఇక నుంచి 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్

మందుబాబులకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పై కొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నది పోలీస్ శాఖ. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని భావిస్తోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మృతదేహానికి నివాళులర్పించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు సంకేతంగా ఉన్నాయి.

తాగి బండి నడిపేవారు కచ్చితంగా టెర్రరిస్టే.. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అన్నారు. తాగి కారు నడపటం వల్ల రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చనిపోయిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కుటుంబం సైతం ఇప్పుడు ఇబ్బంది పడుతుందని.. తాగి బండి నడపటం వల్లే ఇలా జరిగింది అన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ఎంత చెప్పినా ఎవరూ వినటం లేదు.. భయం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు సీపీ సజ్జనార్. ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో, కాలనీల్లోనూ తనిఖీలు ఉంటాయన్నారు. ప్రజలు ఎవరూ మందు తాగి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎవరైనా మందు కొట్టి వాహనం నడపాలి అనుకుంటే భయపడే విధంగా శిక్షలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు కమిషనర్ సజ్జనార్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు