అక్కడ పసుపు – కుంకుమ : ఇక్కడ వరద సాయం 10 వేలు -హిస్టరీని గుర్తు చేసిన జీహెచ్ఎంసీ

వరద సాయం 10 వేలు అనేది.. ఏపీలో చంద్రబాబు పసుపు కుంకుమ స్కీంను గుర్తుకుతెచ్చింది. అక్కడ అయితే టీడీపీ చావు దెబ్బ తిన్నది.. టీఆర్ఎస్ కు ఈ 10 వేలు గట్టెక్కిస్తుందా..

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఎంత హడావిడి.. ఎంతో వ్యూహాత్మకంగా ప్రకటించాం అనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి.. గంటలు గడిచేకొద్దీ హైరానా.. హైటెన్షన్ పట్టుకుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత వరద సాయం 10 వేల రూపాయలు ఇవ్వటానికి అభ్యంతరం లేదు అని ప్రకటించిన ఎన్నికల కమిషన్.. 24 గంటల్లోనే ఎన్నికల కోడ్ అని చెప్పి బ్రేక్ వేసింది. అప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల మంది.. వందల మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపులు కాశారు. తీరా మధ్యాహ్నం తర్వాత ఈసీ ఉత్తర్వులతో దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ పడింది. ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు.

అసలు విషయం ఏంటంటే.. వరద సాయం 10 వేల రూపాయలతో టీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడతాయని భావించారు. వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది. విమర్శలు, ఆరోపణలు, ఆవేశాలు వ్యక్తం అయ్యాయి బాధితుల నుంచి.
ఇది ఎలా ఉంది అంటే.. ఏపీలో గత ఎన్నికల ముందు.. సీఎం హోదా చంద్రబాబు పెట్టిన లాస్ట్ సంతకం పసుపు కుంకుమ.. ఒక్కో మహిళకు 10 వేలు ఇచ్చారు.. అయినా ఏమైందీ 10 వేలు తీసుకుని సక్కగా వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుద్దేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే 10 వేల రూపాయల అంశం వివాదాలకు కేంద్రంగా మారింది. దరఖాస్తు పెట్టుకుంటే 10 వేలు వేస్తాం అనేసరికి.. వరద లేని ప్రాంతవాసులు కూడా బండ్లు, కార్లు వేసుకుని వచ్చి దరఖాస్తు పెట్టుకున్నారు. వీళ్లందరికీ ఓటు ఉందా అనేది కూడా చూడలేదు.. వాళ్లు బాధితులా అనే విషయం కూడా విచారణ చేయలేదు. దీని వల్ల నిజమైన అర్హులైన లబ్దిదారులు, బాధితులు నష్టపోయారు.
వరద వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు ఇంకా ఉన్నాయి. నెల రోజులు దాటుతున్నా ముంపు ప్రాంతాల నుంచి ఇళ్లు బయటపడలేదు. అలాంటి ప్రాంతాలను బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో.. వరద సాయం పేరుతో.. విచారణ, ఎంక్వయిరీ లేకుండా దరఖాస్తు పెట్టుకుంటే ఇస్తాం అని చెప్పటమే టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుగా భావిస్తున్నారు.

ఏది ఏమైతేనేం.. వరద సాయం 10 వేలు అనేది.. ఏపీలో చంద్రబాబు పసుపు కుంకుమ స్కీంను గుర్తుకుతెచ్చింది. అక్కడ అయితే టీడీపీ చావు దెబ్బ తిన్నది.. టీఆర్ఎస్ కు ఈ 10 వేలు గట్టెక్కిస్తుందా.. కాషాయానికి కలరింగ్ ఇస్తుందా అనే మరో 15 రోజుల్లో తేలిపోనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు