దుబ్బాకలో మద్దతు.. జీహెచ్ఎంసీలో పోటీ.. పవన్ సార్.. ఎందుకిలా చేశారు.. జనసేన కార్యకర్తల అంతర్మథనం

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీతోనో మరో పార్టీతోనో పొత్తు పెట్టుకుంటే అప్పుడు మళ్లీ ప్రత్యర్థులుగా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవరికీ అంతుచిక్కటం లేదు. బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించిన ఆయన పార్టీ జనసేన.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఏపీలో కలిసి నడుస్తాం అన్నారు.. జాతీయ పార్టీతో పొత్తు అంటే.. అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉంటుంది కదా.. మరి తెలంగాణలో కూడా అలాగే అనుకున్నాం.. జాతీయ పార్టీ బీజేపీ రెండు రాష్ట్రాల్లో ఉన్నట్లే.. జనసేన పార్టీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసే ఉంటుందని భావించాం.. మీరు తీసుకున్న నిర్ణయం మా అందరికీ షాక్ కు గురి చేసింది.

ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్లి చావు దెబ్బ తిన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాతే కదా టీడీపీని కాదని.. కామ్రేడ్లను వదులుకుని.. బీజేపీతో జట్టు కట్టాం. ఇది కూడా మూన్నాళ్లు ముచ్చటేనా.. దుబ్బాకలో ఎటూ పోటీ చేయలేదు.. బీజేపీకి మద్దతు ఇచ్చాం.. ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి గెలిచిన తర్వాత జనసైనికులకు అభినందనలు అని చెప్పారు.

వారం తిరక్కుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీతో సంబంధం లేదు అని ప్రకటించటం వెనక వ్యూహం ఏంటీ.. ఎందుకిలా చేశారు అని ప్రత్యర్థులు అడిగితే ఏం సమాధానం చెప్పాలి.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు జనసేనను ప్రత్యర్థి పార్టీగా భావించి విమర్శలు, ఆరోపణలు చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీతోనో మరో పార్టీతోనో పొత్తు పెట్టుకుంటే అప్పుడు మళ్లీ ప్రత్యర్థులుగా మారిన మిత్రులు, మిత్రులుగా అయ్యే ప్రత్యర్థులకు సమాధానం కార్యకర్తలు, అభిమానులు కదా చెప్పాల్సింది.

నేతలు, కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు పొత్తులు, పోటీ అంటే ఎలా సారూ.. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి.. మీ వెంటే నడుస్తున్న మేం స్థానికంగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. పొత్తు ధర్మమా.. రాజకీయ వ్యూహమా అనేది కూడా క్లారిటీ రావటం లేదు.. ఎందుకు సారూ ఇలా చేశారు.. దుబ్బాకలో మద్దతు ఇచ్చి.. జీహెచ్ఎంసీలో అదే పార్టీపై.. అదే రాష్ట్రంలో పోటీ అంటే ఏం చెప్పుకోవాలి.. ఎలా పోరాడాలి సారూ..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు