ఇదేమి ధర్మశాస్త్రం : 51 మంది మరణాలకు కారణం అంటూ బదిలీ చేసిన వ్యక్తినే.. మళ్లీ తెచ్చి పెడతారా

ఇంత మందిని చంపాడని పోలీసులు, విచారణ సంస్థలు ముద్దాయి అని చెబుతుంటే.. కోర్టులో కేసులు ఉంటే.. మళ్లీ అలాంటి వ్యక్తిని పోర్టు అధికారిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేయటం అంటే.. ప్రజల ప్రాణాలు అంటే...

kachaluru boat accident
kachaluru boat accident

పేరులో ధర్మం ఉంటే సరిపోదు చేసే పనిలోనూ అంతే ధర్మం ఉండాలి.. లేకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు. పశ్చిమగోదావరి జిల్లా కచ్చలూరు బోటు ప్రమాదంలో 51 మంది చనిపోయిన ఘటనలో.. ప్రభుత్వం కేసులు పెట్టింది. వరద సమయంలో బోటును గోదావరిలోకి అనుమతించడం, బోటుకు ఫిట్‌నెస్‌ ఇవ్వడమే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని పోలీసులు తేల్చారు. పోర్టు అధికారిగా ఉన్న శ్రీధర్మాశాస్తాను ప్రమాదం తర్వాత మచిలీపట్నానికి బదిలీ చేసింది.

ఆయన స్థానంలో పోర్టు అధికారిగా బాధ్యత తీసుకున్న మరో అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా.. పోలీసులు శ్రీధర్మశాస్తా, పోర్టు కన్జర్వేటర్‌గా పనిచేసిన కేవీఎ్‌సఎస్‌ రామచంద్రవర్మ, నేవెల్‌ ఆర్క్‌టెక్‌ ఏవీ లక్ష్మణరాజు, సర్వేయర్‌ పి.మురళీకృష్ణ, చీఫ్‌ సర్వేయర్‌ కె.రమేష్‌లను నిందితులుగా తేల్చారు. ఇదంతా గతం.. ఇప్పుడు మళ్లీ శ్రీధర్మశాస్తా తెరపైకి వచ్చారు.

అప్పట్లో శ్రీధర్మశాస్తాను కేవలం బదిలీ మాత్రమే చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ తిరిగి కాకినాడ పోర్టు అధికారిగా తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తోంది. కరోనాతో ఏడాది కాలంగా ఆగిపోయిన టూరిజం మళ్లీ మొదలు కావటంతో లాబీయింగ్ జోరుగా సాగుతుంది. అప్పట్లో 51 మంది మరణానికి కారణం అని తేల్చిన ప్రభుత్వమే.. అన్నీ మర్చిపోవటం విశేషం.

ఇప్పటి వరకు ఆ బాధితులకు న్యాయం జరక్కపోగా.. ఇంత పెద్ద ఘటనకు కారణం అయిన కేసులో శ్రీధర్మశాస్తాను కేవలం బదిలీతో సరిపెట్టటం అనుమానాలకు తావిస్తోంది. శ్రీధర్మశాస్తా వెనక బలమైన శక్తులు ఉన్నాయని.. అందుకే ఆయన్ను మళ్లీ పోర్టు అధికారిగా తీసుకురాబోతున్నదని చర్చ జరుగుతుంది.

పోర్టు అధికారిగా ఉంటే.. జీతం కంటే వ్యక్తిగత ప్రయోజనాలు చాలా ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. టూరిజం బోట్లలో ఎక్కే ప్రతి ప్రయాణికుడి నుంచి ఇంత వాటా అని ట్రావెల్స్ నుంచి మామూళ్లు వసూలు చేస్తారని.. ఫిట్ నెట్ అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రయోజనాలు ఉంటాయనే విషయం.. కచ్చలూరు బోటు ప్రమాదం విచారణలో స్పష్టం అయ్యింది.

అదే విధంగా సముద్రంలోని బోట్లు, పడవలకు ఇంధనం సరఫరా చేసే విషయంలో భారీ ఎత్తున చేతులు మారతాయని మత్స్యకారులే చెబుతుంటారు. ఆయిల్ కంపెనీ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో వీరికి ముడుపులు ముడతాయనే ఉద్దేశంతో ఈ పోస్టుకు చాలా గిరాకీ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీధర్మశాస్తా తనకున్న పరిచయాలతో.. తెర వెనక లాబీయింగ్ చేస్తూ.. మళ్లీ కాకినాడ పోర్టు అధికారిగా రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన ఉంది.

ప్రపంచంలో ఇంత దుర్మార్గం ఉంటుందా.. ఇంత మందిని చంపాడని పోలీసులు, విచారణ సంస్థలు ముద్దాయి అని చెబుతుంటే.. కోర్టులో కేసులు ఉంటే.. మళ్లీ అలాంటి వ్యక్తిని పోర్టు అధికారిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేయటం అంటే.. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేని తనమే అంటున్నారు బోటు ప్రమాదం బాధితులు.

శ్రీధర్మశాస్తా పలుకుబడి ముందు.. ప్రాణాలు లెక్కా ఏంటీ వీళ్లకు.. అధర్మంగా అయినా శ్రీధర్మశాస్తాను తీసుకు రావటమే లక్ష్యంగా పని చేస్తున్న శక్తులు గెలుస్తాయా లేక బాధితుల కన్నీళ్లు గెలుస్తాయో చూడాలి. శ్రీధర్మశాస్తా మళ్లీ కాకినాడ పోర్టుకు అధికారిగా వస్తే మాత్రం.. ప్రభుత్వం అధర్మం వైపు ఉన్నట్లే అంటున్నారు బాధితులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు