సాగర్ తర్వాత.. తెలంగాణలో మరో భారీ ఎన్నిక – మే 2 తర్వాత కేసీఆర్ కసరత్తు

cm kcr shocking decision on malls and cinema halls by corona

తెలంగాణ రాష్ట్రంలో అందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనే ఉంది.. ఎవర్ని కదిలించినా ఇదే మాట మాట్లాడుతున్నారు. అంతకు మించి.. మరో భారీ ఎన్నిక జరగబోతుందని.. అందు కోసం సుమారు వంద మంది ఆశావహులు పోటీ ఉన్నారన్న విషయం ప్రజలకు తెలియదు.. కారణం ఏంటంటే.. ఎమ్మెల్యే కోటా జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అవి. పరోక్ష పద్ధతిలో జరగబోతున్న ఈ ఎన్నికలు మే జరగబోతున్నాయి.

2021, జూన్ 3వ తేదీతో తెలంగాణ మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. వీరిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీరుద్దీన్ ఉన్నారు. వీరి పదవీ కాలంలో జూన్ 3వ తేదీతో ముగుస్తుండగా.. మే నెలాఖరులో కొత్త సభ్యుల కోసం ఎన్నిక జరగనుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో జరుగుతున్న ఎన్నిక ఇదే. దీంతో ఆశావహులు భారీగా ఉన్నారు. ఇప్పటి నుంచే పార్టీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం రిటైర్ అవుతున్న వారిలో ఎంత మందికి మళ్లీ ఛాన్స్ వస్తుంది అనేది మరో ఆసక్తి. ఆరుగురిలో ఎవరికీ మళ్లీ అవకాశం ఇచ్చే సూచనలు లేవని.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి ఈసారి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం అందరిలో ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. మే 2వ తేదీ ఫలితం తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక కోసం కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉండటం.. ఆశావహులు బారీ ఎత్తున రికమండేషన్స్ తో పార్టీకి విజ్ణప్తులు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, కవితతోపాటు.. కేసీఆర్ కుటుంబ సభ్యుల దగ్గర తమ ప్రొఫైల్స్ ఇస్తూ.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కావటంతో.. గెలుపు ఖాయం కాబట్టి.. ఎలాగైనా ఈసారి ఎమ్మెల్సీ కావాలనే ఉద్దేశంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారంట టీఆర్ఎస్ నేతలు. మరి కేసీఆర్ ఎవర్ని సెలక్ట్ చేస్తారు.. సీనియర్స్ అవకాశం ఇస్తారా లేక యువతకు పెద్ద పీట వేస్తారా.. విధేయులను ఎంపిక చేస్తారా.. పారిశ్రామికవేత్తలకు ఏమైనా ఛాన్స్ ఇస్తారా.. కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది.. ఆరుగురు కొత్త ఎమ్మెల్సీలు ఎవరు అనే విషయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు