యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు

ktr becomes active in telangana politics

సీఎం కేసీఆర్ కరోనాతో ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజులు అయినా ఆయన ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. అవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందించటానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం – పార్టీ బాధ్యతలు మొత్తం ఇప్పుడు మంత్రి కేటీఆర్ పై పడ్డాయి.

సీఎం కేసీఆర్ కరోనాతో ఇంటికే పరిమితం అయిన సందర్భంలో.. ప్రభుత్వం బాధ్యతలను ఇప్పుడు కేటీఆర్ చూస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరీస్థితులపై మంత్రి ఈటెల, ఇతర వైద్య అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో 48 గంటల్లో.. అనగా ఏప్రిల్ 22వ తేదీ నాటికి కరోనాపై కట్టడి కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ ఏది పెడతారు.. ప్రభుత్వ చర్యలు ఏంటీ.. ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అనే విషయాలను చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆయనే కరోనా బారిన పడి.. చికిత్స తీసుకుంటున్నారు. ఆయన్ను కలిసి.. వ్యక్తిగతంగా సమీక్ష చేసే అవకాశం లేదు. ఈ క్రమంలోనే ఈ బధ్యతను మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారు. మిగతా కీలక నిర్ణయాలు అన్నీ ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర మంత్రులతో చర్చించనున్నారు.

అప్పట్లో ప్రధానమంత్రి వాజ్ పేయి కాలికి ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో యాక్టివ్ పీఎంగా అద్వానీ వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రస్తుతానికి అయితే యాక్టివ్ సీఎంగా మంత్రి కేటీఆర్ అంటూ పార్టీలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది తాత్కాలికమే అయినా.. రాబోయే రోజుల్లో శాశ్వతం కావొచ్చనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే చాలా సార్లు పత్రికలు, టీవీల్లో కేటీఆర్ కు పట్టాభిషేకం అని వార్తలు వచ్చాయి. ప్రచారం జరిగింది. ఇప్పటికి అయితే యాక్టివ్ సీఎం.. రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు.. సీఎం కేటీఆర్ కావొచ్చు కదా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు