తక్కెళ్లపాడు శ్రీశైలనాథన్ అయ్యంగార్ ఇక లేరు : ప్రతాపరుద్రుని నుంచి వారసత్వ సంపద.. వాస్తు, వైద్యం, సామాజిక సేవలో విశేష కృషి

takkellapadu ayyangar

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అంటే గుర్తొచ్చే.. అతి కొద్ది మందిలో ఒకరు తక్కెళ్లపాడు అయ్యంగార్.. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్లపాడుని అగ్రహారంగా చేసుకుని తరతరాలుగా వారసత్వ సంపదను కాపాడుతూ వస్తున్నారు తక్కెళ్లపాడు అయ్యంగార్ శ్రీశైలనాధన్ గారు. అనారోగ్యం వల్ల ఆయన ఏప్రిల్ 28వ తేదీన కన్నుమూశారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖలతోపాటు.. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పండితులు, రాజకీయ నేతలు, ప్రజలు ఆయన సేవలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు.

అద్దంకి వంశస్థులకు చెందిన ఈ అయ్యంగార్లు.. ప్రతాపరుద్రుని కాలం నుంచి వారసత్వ సంపదతోపాటు సామాజిక, విద్య, వైద్య సేవల్లో కొనసాగుతూ వస్తున్నారు. రాణి రుద్రమదేవి తర్వాత.. ఆమె వారసుడుగా ప్రతాపరుద్రుడు పరిపాలించిన సమయంలో.. అద్దంకి వంశస్థులు.. అద్దంకి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శాస్త్రం, ఆలయ రక్షణ, విజ్ణానం, వైద్యం, విద్య విషయాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారు. అద్దంకి వంశస్థుల సేవలను గుర్తించిన అప్పటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. అద్దంకి వంశస్థులకు తక్కెళ్లపాడును అగ్రహారంగా ఇవ్వటంతోపాటు వేలాది ఎకరాల భూమిని సమర్పించుకున్నారు. అదే విధంగా అద్దంకి వంశస్థులకు ప్రతాపరుద్రుడు.. తన ఖడ్గాన్ని బహుమతిగా అందజేసి.. పరిపాలనలో సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు.. చరిత్రను లిఖించాల్సింది కోరారు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

అద్దంకి వంశస్థుల పూర్వీకులు అప్పట్లో ప్రతాపరుద్రదేవ మహారాజుల పేరుతో శాసనాలు రాశారని చెబుతారు. ప్రకాశం జిల్లా కండ్లకుంట, రావినూతల, గుంటూరు జిల్లా గోరవెంకపల్లిలో లభించిన ప్రతాపరుద్రుని శాసనాలు అద్దంకి వంశస్థుల పూర్వీకులు రాయబడినవిగా కొందరు చరిత్రకారులు చెబుతారు. కొన్ని శాసనాలు ఇప్పటికీ అయ్యంగార్ల ఇంట్లో పదిలంగా ఉన్నాయి.

అలాంటి అద్దంకి వంశస్థుల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు శ్రీశైలనాథన్ అయ్యంగార్. 68 ఏళ్ల అయ్యంగార్.. కాలానికి తగ్గట్టు ప్రజా, సామాజిక సేవలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో ప్రతి ఏటా వేసవికాలంలో నీటి సమస్య వచ్చేది. 5 వేల మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. తక్కెళ్లపాడులో పెద్ద చెరువు తవ్వాలని.. అందుకు కావాల్సిన భూమి కోసం దాతల సాయం కోరారు గ్రామస్తులు. ఆ సమయంలో ముందుకు వచ్చారు అద్దంకి శ్రీశైలనాధన్, శ్రీరామప్రియ అయ్యంగార్ సోదరులు. తాతల నుంచి వారసత్వంగా.. అన్ని హక్కులతో సంక్రమించిన 25 ఎకరాల భూమిని చెరువు నిర్మాణానికి దానం ఇచ్చారు. అన్ని హక్కులతో పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారు.

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఏ ఆలయ నిర్మాణం అయినా.. విగ్రహ ప్రతిష్ఠ అయినా అయ్యంగార్ ముహూర్తం పెట్టాల్సిందే. ఈయన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించరు.. ఎంత పెద్ద నేతలు వచ్చినా ఇదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి, రామానాయుడు, కరణం బలరాం, వైవీ సుబ్బారెడ్డి వంటి ఎంతో మంది రాజకీయ ప్రముఖులకు తక్కెళ్లపాడు అయ్యంగార్ మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆయన ఆశీస్సులు తీసుకునే పనులు మొదలుపెట్టేవారు.

ayyamgar

చిలకలూరిపేట – మార్టూరు మధ్య బొప్పూడి గ్రామం దగ్గర నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఈ సమస్యను ఆధ్యాత్మిక కోణంలో పరిష్కరించారు శ్రీశైలనాథన్ అయ్యంగార్. బొప్పూడిలో ఆలయ అభివృద్ధితోపాటు పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని తన చేతులతో ప్రతిష్టించారు. 2 వేల సంవత్సరంలో ఈ బొప్పూడిలో ఆలయ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట తర్వాత.. బొప్పూడికి ఉన్న యాక్సిడెంట్ స్పాట్ అనే మచ్చ తొలగిపోయింది. 21 ఏళ్లుగా ఈ విషయాన్ని ఆ గ్రామస్తుల స్మరించుకుంటూ ఉండటం విశేషం.

2 వేల సంవత్సరం నాటికే.. శ్రీశైలనాథన్ అయ్యంగార్.. 108 ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసిన సందర్భంగా.. బొప్పూడి గ్రామస్థులు.. అయ్యంగారికు తులాభారంతో ఘన సత్కారం చేశారు. 2021 తుది శ్వాస విడిచిన నాటికి శ్రీశైలనాథన్ చేతుల మీదుగా సుమారు 500కు పైగా ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో బొడ్డురాయి ప్రతిష్ఠ అంటే శ్రీశైలనాథన్ అయ్యంగారు ముహూర్తం పెట్టాల్సిందే.. వేలాది బొడ్డు రాయి ప్రతిష్టాపనలు చేసి ఆయా గ్రామ ప్రజల మన్ననలు పొందారు.. ఆయా గ్రామాల్లో అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారు.

పురాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయ వైద్యం అందించటంతోపాటు అందుకు కావాల్సిన మందులను ఉచితంగా అందిస్తూ వస్తోంది ఆ కుటుంబం. వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను.. ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించటంలో ఎప్పుడూ ముందుండేవారు. తనకు ఉన్న పరిచయాలతో ఎంతో మంది విద్యార్థులకు ఉచిత విద్య, ఉద్యోగ సాయం చేయటం ద్వారా ఎన్నో మన్ననలు పొందారు శ్రీశైలనాథన్ అయ్యంగార్..

శ్రీశైలనాధన్ అయ్యంగార్ కు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన 300 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంధాలు, ప్రతాపరుద్రుడు స్వయంగా అందజేసిన కత్తి ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. శ్రీశైలనాథన్ ముత్తాత అయిన అద్దంకి తిరుమల తాతాచార్యులు రచించిన పార్వతీలహరి, ఆవీళహరి, గాయత్రీలహరి అనే కావ్యాలను రచించటమే కాకుండా.. ద్రవిడ భాష నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంథాలను అనువదించి.. పండితుల ప్రశంసలు పొందారు. తిరుమల తాతాచార్యులు సంస్కృతం, ప్రాకృత, తెలుగు భాషల్లో పండితులు. తాతాచార్యుల వారసత్వాన్ని కాపాడుతూ వస్తోంది ఈ కుటుంబం.

68 ఏళ్ల అద్దంకి శ్రీశైలనాథన్ అయ్యంగార్ 2021, ఏప్రిల్ 28వ తేదీన తుది శ్వాస విడవటం అందరినీ కలిచివేస్తుంది. నిత్యం ప్రజల కోసం.. సాయం అడిగితే కాదనని అతని వ్యక్తిత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తక్కెళ్లపాడు గ్రామంతోపాటు చుట్టుపక్కల అనేక గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండటమే కాకుండా.. అయ్యంగార్ ఇంటి నుంచి తాళిబొట్టు తీసుకుంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుందని.. వృద్ధి జరుగుతుందని ప్రజల్లో విశ్వాసం. ప్రతి ఏటా వందల మందికి తాళిబొట్టును సంప్రదాయ పద్దతిలో అందిస్తూ.. కుటుంబ వారసత్వాన్ని కాపాడుతున్నారు శ్రీశైలనాధన్ అయ్యంగార్.. ఆయన లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పూర్వీకులు, తాతలు, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు వారి కుటుంబ సభ్యులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు